
జీఎస్టీ సమావేశంలో గ్రూపు విభేదాలు బహిర్గతం
భట్టిప్రోలు(వేమూరు) : జీఎస్టీపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపుల మధ్య కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమయ్యాయి. భట్టిప్రోలులో సోమవారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీన్ని పార్టీలోని ఒక గ్రూపు బహిష్కరించింది. భట్టిప్రోలు మండల కేంద్రంలో తూనుగుంట్ల సాయిబాబా, బట్టు మల్లికార్జునరావు మధ్య గ్రూపు విభేదాలు నెలకొన్నాయి. రథం సెంటరులో జీఎస్టీపై అవగాహన సదస్సును సోమవారం తూనుగుంట సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. బట్టు మల్లికార్జునరావు వర్గానికి చెందిన పార్టీ నాయకులు హాజరు కాక పోవడంతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తల పట్టుకున్నారు. పార్టీలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత వర్గ పోరు బయట పడటంతో ఆయనకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత శుక్రవారం కొల్లూరు మండల కేంద్రంలోని బస్‌స్టాండ్ సెంటరులో శుక్రవారం జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కొల్లూరు మండలంలోని మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షడు మైనేని మురళీ మధ్య కొనసాగుతున్న వర్గ పోరు కొట్టుకునే దిశగా వెళ్లింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. కొంత మందికి గాయాలయ్యాయి. మిగితా మండలాల్లోనూ విభేదాలు బహిర్గతమయ్యే పరిస్థితి నెలకొందని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. వర్గాల పోరుపై ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఎమ్మెల్యే హాజరైన కనిపించని నాయకులు