
అమరావతిలో ఏడీబీ బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బృందం సోమవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించింది. తొలుత విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లిన ఆ బృందానికి కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ్ తేజలు స్వాగతం పలికారు. అనంతరం సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్)లోని ముఖ్య అధికారులతో బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణ పురోగతిని కమిషనర్ కన్నబాబు వివరించారు. తర్వాత రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పలు పనులను బృందం పరిశీలించింది. గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం(జీఆర్‌ఎం) గురించి వివరాలు తెలుసుకుంది. దీనిపై సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో ఏడీబీ– వాటర్ – అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో (సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ (డైరెక్టర్), సంజయ్ జోషి (ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్ (సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్)లు పాల్గొన్నారు.