
సముద్ర స్నానానికి వచ్చి వివాహిత మృతి
చినగంజాం: సముద్ర స్నానం చేసేందుకు వచ్చి వివాహిత మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మోటుపల్లి సముద్ర తీరంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శీలం రమేష్ వివరాల మేరకు.. చీరాల వాడరేవు పరిధిలోని అడవి పల్లెపాలెం గ్రామానికి చెందిన ఊసుపల్లి శాంతి (25)కి ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన సలగల వినయ్ అనే పాస్టర్‌తో చర్చికి వెళ్లే క్రమంలో పరిచయం ఏర్పడింది. ఆమె గడచిన కొద్ది రోజులుగా పందిళ్లపల్లి పాతరెడ్డి పాలెం గ్రామానికి వచ్చి ఆమె సోదరి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె పాస్టర్ వినయ్‌తో కలిసి మోటుపల్లి సముద్ర తీరానికి స్నానం చేసేందుకు వచ్చింది. ఇద్దరు స్నానం చేసే క్రమంలో ఆమెను నీటిలో వదలి పెట్టి వినయ్ బయటకు వచ్చేశాడు. ఘటనను గమనించి స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆమెను ఒడ్డుకు తీసుకొని వచ్చి 108కి సమాచారం అందించారు. ఆమె ఆ పాటికే చనిపోయినట్లు గుర్తించారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పాస్టర్ వినయ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.