
ప్రతి కార్యకర్తా సైనికుడిలా పోరాడాలి !
బాపట్ల సమన్వయ సమావేశంలో
రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి
ప్రతి గ్రామంలో 30 మంది కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
నవంబర్ 20 నాటికి గ్రామస్థాయిలో అన్ని కమిటీలు పూర్తి
అన్ని అనుబంధ విభాగాలను
పూర్తిగా నియమించాలి
నియోజకవర్గంలో 14 వేల మందిని క్రియాశీలకంగా తయారు చేయాలి
సమన్వయకర్తలు, నేతలు సంస్థాగత నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి
ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకూ తెలియజేయాలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: గ్రామ స్థాయిలో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తా సైనికుడిలా మారాలని రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల కోన భవన్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కీలకమని, గ్రామస్థాయి నుంచి తిరుగులేని శక్తిగా రూపొందించాలని తెలిపారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి అన్ని పార్టీ కమిటీలను నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ స్థాయిలో 30 మంది కార్యకర్తలు సైనికుల్లా మారాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో 1400 మంది కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన నియోజకవర్గ సమన్వయకర్తలను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయి నాయకులు పని చేయాలని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం చెందిందని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ కోత పెట్టిందన్నారు. రైతల పరిస్థితి దుర్భరంగా ఉందని పేర్కొన్నారు. పొగాకు, మిర్చి, టమోటాలకు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందని, గిట్టుబాటు ధరలు లభించాయని గుర్తు చేశారు. ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్‌లో ప్రైవేటు పరం చేసిందని, నకిలీ మద్యం తయారు చేసి పేదల ప్రాణాలను బలికొంటోందని విమర్శించారు. బాధిత వర్గాల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని అభయమిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నేతలు, కార్యకర్తలు గడప గడపకు తీసుకు వెళ్లాలని తెలిపారు. ఇందుకోసం గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సమన్వయకర్తలు కరణం వెంకటేశ్, ఈవూరు గణేష్, వరికూటి అశోక్‌బాబు, గాదె మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, మోదుగుల బసవ పున్నారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్, పుత్తా శివశంకర్‌రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి, కోకి రాఘవరెడ్డి ,అంజనీప్రసాదరెడ్డి, చెంచయ్య, చల్లా రామయ్య, డేవిడ్, విజయకుమార్, అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.