
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పని చేయాలి
మండల స్థాయిలో అర్జీలను వెంటనే పరిష్కరించాలి
గిరిజనులకు ప్రత్యేక గ్రీవెన్స్
జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కొన్నింటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించి, తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సూపర్ జీఎస్టీపై అవగాహన కల్పించాలి
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామ, సచివాలయ పరిధిలో సమావేశాలు ఏర్పాటుకు షెడ్యూల్ తయారు చేయాలని ఆయన ఎంపీడీవోలను ఆదేశించారు. సెలూన్లు, యోగా సెంటర్లలో ధరల వివరాలను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాస్థాయిలో వస్తు ఉత్పత్తుల, ధరలపై ఎగ్జిబిషన్ ఏర్పాటుకు షెడ్యూల్ తయారు చేయాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు జీఎస్టీపై సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిబేట్లు, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వీడియోలను తయారు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ప్రదర్శించాలని ఆయన తెలిపారు. రోజువారి నిర్దేశిత ప్రచార కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
స్థలాన్ని సేకరించాలి
అద్దంకి నియోజకవర్గంలోని ఏడో సబ్‌స్టేషన్ పరిధిలో పీఎం కుసుమ పథకానికి భూ సేకరణపై రైతులతో బుధవారం నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని శనివారం పనులు మొదలు పెట్టాలని ఏపీ సీపీడీసీఎల్ ఎస్‌ఈని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, ఇన్‌చార్జి పీడీ డీఆర్డీఏ లవన్న, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నూరు శాతం నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. సంబంధిత ఫోటోలు, వీడియోలను ఈ– ఆఫీస్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. కాల్ సెంటర్‌లో (1100) నమోదైన అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు వేగంగా పని చేయాలని చెప్పారు.
జిల్లాలో గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వారి కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్‌ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఇన్‌చార్జి పీడీడీఆర్ డీఏ సమన్వయంతో గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.