ఆగని మరణ మృదంగం | - | Sakshi
Sakshi News home page

ఆగని మరణ మృదంగం

Oct 7 2025 3:51 AM | Updated on Oct 7 2025 3:51 AM

ఆగని మరణ మృదంగం

ఆగని మరణ మృదంగం

ఆరు నెలలుగా కొనసాగుతున్న వరుస మరణాలు మెలియాయిడోసిస్‌ అని తేల్చిన కొందరు వైద్యులు రక్త పరీక్షలు చేసినా ఫలితాలు ఇవ్వలేదంటున్న స్థానికులు ఆరు రోజులు భోజనాలు, నెలపాటు వైద్య శిబిరంతో సరిపెట్టిన ప్రభుత్వం సుమారు 46 మందికిపైగా మృత్యువాత పడినా స్పందించని సర్కారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్న ప్రజలు ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్తులు కనీసం మరణాలకు కారణం కూడా చెప్పటం లేదని ఆవేదన ప్రచారానికే పరిమితమైన కూటమి ప్రభుత్వం చర్యలు ఇకనైనా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌

కూటమి పాలకుల నిర్లక్ష్యంతో తురకపాలెంలో మరో మహిళ మృతి

స్జాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్‌:

గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలోని చల్లా కృష్ణవేణి (24) పది రోజులపాటు జ్వరంతో బాధపడి చికిత్స పొందుతూ చివరికి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం మృత్యువాతకు గురైంది. గత నెల సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో రెండు మరణాలు సంభవించిన అనంతరం తీరిగ్గా కూటమి ప్రభుత్వం స్పందించింది. అప్పుడు ఆరు రోజులపాటు గ్రామంలో ప్రజలకు భోజనాలు పెట్టారు. మరో నెల రోజులు మెడికల్‌ క్యాంప్‌ అంటూ హడావుడి చేశారు. అనంతరం పాలకులు చేతులు దులుపుకొన్నారు. కనీసం గ్రామంలో ప్రజల అనారోగ్యానికి కారణం.. ఏ వ్యాధితో మరణిస్తున్నారు.. దీనికి పరిష్కారం ఉందా? లేదా? అనే అంశాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యం వలనే ప్రాణం బలి

పదిరోజులుగా జ్వరంతో ఉన్న కృష్ణవేణి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన రోజు బాగానే ఉందని, బాగానే మాట్లాడి తిరుగుతూనే ఉందని ఆమె భర్త దుర్గారావు, అత్త తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో రోజుకు రూ.30 వేలు అడిగారని చెప్పారు. కూలీనాలీ చేసుకుని బతికే తాము అంత డబ్బు కట్టలేమని చెప్పటంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లమన్నారని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లాక కనీస స్పందన కరువైందని కుటుంబ సభ్యులు వాపోయారు. వైద్యులు పట్టించుకోలేదని తెలిపారు. చివరి నిమిషంలో కనీసం ఆక్సిజన్‌ అయినా పెట్టాలని తాము బతిమాలినా పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు. అక్కడికి వచ్చిన అధికారులను గ్రామస్తులతో కలిసి నిలదీశారు.

ఆరు నెలలుగా అదే పరిస్థితి..

గ్రామంలో ఆరు నెలలుగా సుమారు 46 మందికిపైగా మృత్యువాతకు గురయ్యారు. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొందరు గ్రామంలో బొడ్డురాయి సమస్య అని ఆందోళన చెందారు. నిపుణులు, రాజకీయపార్టీల నేతలు, అధికారులు కొందరు తాగునీరు కలుషితం కావడం వల్ల సమస్య వచ్చిందని పేర్కొన్నారు. ఈ రెండింటిలో బొడ్డురాయి సమస్యను స్థానిక పెద్దలు సంప్రదాయబద్ధంగా పరిష్కారం చూపారు. మెలియాయిడోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాధి సంక్రమించి అనారోగ్యాలకు గురవుతున్నారని వైద్యులు తెలిపారు. కానీ ఈ వ్యాధికి చికిత్స ఏంటి? ఏ మందులు వాడాలనే విషయాన్ని గ్రామస్తులకు చెప్పిన వారే లేరు. నెల రోజుల తరువాత మరో మరణం సంభవించటంతో గ్రామంలో కలకలం రేగింది. జీజీహెచ్‌లో చికిత్స పొందిన బాధితురాలు అదే వ్యాధితో మృతి చెందిందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

కొన్ని రోజుల హడావుడే..

గ్రామంలో ప్రజలు ఆకస్మిక మరణాల విషయం వెలుగు చూడటం, మీడియాలో సంచలన కథనాలు, వార్తలు రావడంతో ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. గ్రామంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. పరీక్షలు చేశారు. గ్రామంలో దాదాపు వెయ్యి మందికి కిడ్నీ సమస్యలున్నాయని తేలిందని, మరో 300 మందికిపైగా లివర్‌ సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించామని వైద్యులు తెలిపారు. వారికి పరీక్ష ఫలితాలను ఇవ్వలేదు. టాబ్లెట్‌, ఇంజక్షన్‌ కూడా లేదు. ఆరు రోజులు భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఆ ఊసే లేదు. మరణించినవారి కుటుంబాలకు న్యాయం చేయలేదు. బాధితులు కలెక్టరేట్‌, తదితర అధికారులకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా వారికి న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున జ్వరాలతో గ్రామస్తులు బాధపడుతూనే ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా తమను పట్టించుకోవటంలేదని వాపోతున్నారు. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌లో ఒకరిద్దరు వైద్యులు ఉన్నా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement