బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి: డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారికి అందిస్తున్న శిక్షణ తరగతులను సోమవారం డీఈఓ సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని హితవు పలికారు. కార్యక్రమంలో పల్నాడుజిల్లా విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, శిక్షణ కేంద్రాం ఇన్‌చార్జి సత్యనారాయణసింగ్, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్‌పర్సన్‌లు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 588.00 అడుగులకు చేరింది. ఇది 306.1010 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 9,076, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,211, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 54,427 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 54,427 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకుల లెక్కింపు ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు సోమవారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో నిర్వహించే లెక్కింపులో పాల్గొనదలచిన భక్తులు డ్రస్‌కోడ్‌లో హాజరు కావాలని సూచించారు. కానుకల లెక్కింపు కారణంగా ఆ రోజున జరగాల్సిన స్వామివారి నిత్య శాంతి కల్యాణం ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తారని తెలియజేశారు.

15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపు