
నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం ఉత్పత్తి చేసి, షాపులకు విక్రయిస్తూ పేదల ప్రాణాలను బలిగొంటోందని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం బాపట్లలోని కోన భవన్‌లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నకిలీ మద్యం పరిశ్రమను అధికారులే కనుగొన్నారని పేర్కొన్నారు. నాసి రకం మద్యానికి ప్రజలు బలి కాకముందే దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వైవీ డిమాండ్ చేశారు. కూటమి పాలన వచ్చాక పేద ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, సంక్షేమ పథకాల్లోనూ కోతలు పెట్టిందని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని వారికి అందకుండా చేస్తోందని వైవీ విమర్శించారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సదుద్దేశంతో నెలకొల్పిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలను మొదలు పెట్టి, ఆరు కళాశాలలను పూర్తి చేశారన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించడం దుర్మార్గమని ఖండించారు. లేని లిక్కర్ స్కాం అంటగట్టి వైఎస్సార్‌సీపీ నేతలను బదనాం చేశారని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని, దీన్ని పార్టీ సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. బాధితులకు అండగా పార్టీ లీగల్ టీం పని చేస్తుందని, పార్టీ సైతం అండగా ఉందని హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్థాగతంగా వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సమన్వయకర్తలు కరణం వెంకటేశ్, ఈవూరు గణేష్, వరికూటి అశోక్‌బాబు, గాదె మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్, పుత్తా శివశంకర్‌రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు.