
క్లాప్ మిత్రల కృషితోనే జిల్లాకు అవార్డులు
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పగలు, రాత్రీ తేడా లేకుండా క్లాప్ మిత్రలు పనిచేయడం ద్వారానే బాపట్ల జిల్లాకు విరివిగా అవార్డులు లభించాయని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో జరిగింది.అనంతరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు ఎంపికై న వారికి జిల్లా కలెక్టర్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యా, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయయన చెప్పారు. రానున్న మూడు నెలల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వ్యర్థాలను పద్ధతి ప్రకారం తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెత్త సంపద కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. రాననున్న రోజుల్లో బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే తృతీయ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం అధికారులు, ఉద్యోగులంతా కృషి చేయాలని చెప్పారు. చెరుకుపల్లి మండలంలోని కావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాలకు 49 అవార్డులు లభించడం సంతోషదాయకమని తెలిపారు. 146 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గాంధీజీ స్ఫూర్తితో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించామని ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి.ఎస్.నారాయణభట్టు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు, ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.వెంకట రమణ, ఆర్డీఓ పి. గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు పాల్గొన్నారు.