
కూటమి కుయుక్తులకు చెక్
హామీలు నెరవేర్చని సర్కార్
● ఘనంగా అద్దంకి నూతన
సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్
బాధ్యతల స్వీకరణ
● అడ్డరోడ్డు నుంచి అద్దంకి వరకు
పోలీసుల అవాంతరాలు
● బల్లికురవ మండలం వైదన వద్ద మట్టి
ట్రాక్టర్ పెట్టి అడ్డుకున్న వైనం
● స్థైర్యం కోల్పోని వైఎస్సార్‌సీపీ నేతలు,
కార్యకర్తలు
● భారీ జనసందోహం మధ్య వేదిక
వరకు పయనం
అద్దంకి: వైఎస్సార్‌సీపీకి ప్రజాబలం ఎంత ఉందో.. కూటమి పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో శనివారం అడుగడుగునా చోటు చేసుకున్న ఘటనలు నిరూపించాయి. వైఎస్సార్ సీపీ నూతన సమన్వయకర్త డాక్టర్ అశోక్‌కుమార్ బాధ్యతల స్వీకరణ, జన్మదిన వేడుకల కార్యక్రమం శనివారం అద్దంకి పట్టణంలోని కూకట్ల కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించేందుకు ఆయనతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పిడుగురాళ్ల నుంచి బయలు దేరారు. కానీ పోలీసులు అవాంతరాలు సృష్టించారు. వాటన్నింటినీ అధిగమించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అద్దంకి నూతన సమన్వయకర్త పిడుగురాళ్ల నుంచి బయలుదేరగా.. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద నాయకులు ఆయనకు సంఘీభావంగా తరలివెళ్లారు. అక్కడకు పోలీసులు చేరుకుని ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. బల్లికురవ మండలంలోని వైదన వద్ద ఏకంగా మట్టి ట్రాక్టర్‌ను అడ్డుపెట్టించారు. శింగరకొండ వద్దకు చేరుకున్న తర్వాత కూడా అన్ని కార్లను అనుమతించలేదు. ఇలా అడుగడుగునా పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. తమకు అనుమతులు ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు వెళ్లనివ్వరంటూ డాక్టర్ అశోక్ కుమార్ గట్టిగా ప్రశ్నించారు. ఆయనకు అడుగడుగునా కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. వేదిక వద్ద భారీ గజమాల వేసి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు ప్రసంగించారు.
● వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు తూమాటి మాధవరావు వేదికపై మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఽఅధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయిందన్నారు. గ్రామాల్లోకి పోలీసులు లేకుండా ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.
● పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ నాయకులను, కార్యకర్తలను పోలీసులతో అడ్డుకోలేరన్నారు. భయపెడదామని అనుకుంటే కుదరదన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని చెప్పారు.
● మాజీ ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకోవడంతోనే కూటమి పతనం మొదలైందని... కేసులకు భయపడేది లేదన్నారు.
● నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతా మార్పు మొదలైందన్నారు. మట్టి ట్రాక్టరను అడ్డుపెట్టి అభిమానాన్ని ఆపాలని చూసినప్పుడే వారు భయపడుతున్నారని అర్థం చేసుకోవాలన్నారు.
● పార్టీ నేత గౌతం రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు ప్రజలు తెలుసని.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
పచ్చ పార్టీ అబద్ధపు హామీలు ఇవ్వడమే కానీ ఎప్పుడూ అమలు చేసిన దాఖలాలు లేవని నూతన సమన్వయకర్త డాక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ఇక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఏం చేశాడని ప్రశ్నించారు. తాను లీడర్‌గా రాలేదని.. ప్రజా సేవకునిగా వచ్చానని చెప్పారు. ఇక్కడ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి కల్పన, మహిళా సాధికారత సాధించేలా పనిచేస్తానన్నారు. తొలుత శింగకొండలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డి, పలు విభాగాల నేతలు చల్లా రామయ్య, గునుపూడి రఘురామగుప్తా, ఈదా శ్రీనివాసరెడ్డి, కాకాని రాధాకృష్ణమూర్తి, జడ విజయ్ కుమార్, కేవీ ప్రసాద్, దేవినేని కృష్ణబాబు, జి.జగన్‌మోహన్‌రెడ్డి, రావూరి శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీధర్, వూట్ల నాగేశ్వరరావు, మురహరి యాదవ్, చందోలు రాజకుమార్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కూటమి కుయుక్తులకు చెక్