
టీడీపీలో రెండు వర్గాల ఘర్షణ
ఓ వర్గంపై మరో వర్గం దాడి నడి రోడ్డుపై ఎమ్మెల్యే సాక్షిగా ఘర్షణ పలువురికి గాయాలు, ఓ పోలీసుకు స్పల్ప గాయాలు
కొల్లూరు: తెలుగు తమ్ముళ్ల రెచ్చిపోయారు. టీడీపీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే సాక్షిగా తన్నులాటకు దారితీసింది. కొల్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. టీడీపీ మండలాధ్యక్షుడు మైనేని మురళీ, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గాల నడుమ మాటల యుద్ధం జరిగింది. కొల్లూరు ఎంప్లాయీస్ రిక్రియేషన్ హోమ్‌లో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీకి వచ్చారు. ఆ సమయంలో మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్‌ను లక్ష్యంగా చేసుకొని అనంతవరానికి చెందిన నాయకుడు అనుచరులు అవాకులు, చవాకులకు దిగారు. కనగాల వర్గం నాయకులు స్థానిక బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ కార్యక్రమం జీఎస్టీ సమావేశం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సాక్షిగా జీఎస్టీ సమావేశం ప్రారంభభమవుతున్న సమయంలో ఇరువర్గాల నడుమ మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక వర్గంపై మరో వర్గం బాహాబాహీకి దిగి పిడి గుద్దులు, చేతి కందిన కుర్చీలు, హెల్మెట్లతో పరస్పరం దాడులకు దిగారు. సర్దుబాటు చేసేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
టీడీపీ వర్గాల నడుమ దాడులను సెల్ ఫోన్‌లలో చిత్రీకరిస్తున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే, కొట్లాట విషయం పక్కన పెట్టి వీడియోలు తీయడం ఆపించాలని పోలీసులకు హుకుం జారీ చేయడంతో వారు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్‌లు లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు. తెలుగు తమ్ముళ్ల తన్నులాటలో టీడీపీ మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ కింద పడిపోవడంతో ఎమ్మెల్యే ఆనందబాబు పరిస్థితిని అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది.
పలువురికి గాయాలు
టీడీపీ వర్గీయుల కొట్లాటను తాత్కాలికంగా సద్దుమణిచి రెండు ముక్కలలో జీఎస్టీ సమావేశాన్ని ముగించిన ఎమ్మెల్యే ఆనందబాబు అక్కడ నుంచి జారుకున్నారు. అనంతరం తిరిగి మళ్లీ ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. అనంతవరానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు కనగాల మధుసూదన్ ప్రసాద్‌ను దూషిస్తున్నాడన్న కారణంతో ఆయన అనుచరులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గానికి చెందిన ఓ యువకుడు ఒంటరిగా ఓ మెడికల్ షాప్ వద్ద ఉండటాన్ని గమనించిన మైనేని మురళీకృష్ణ వర్గీయులు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీనికి ప్రతిగా కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గీయులు మైనేని వర్గీయులపై దాడులకు దిగడంతో పలువురు గాయల పాలయ్యారు. వీరి మధ్య కొట్లాట నెలకొన్న పరిస్థితుల్లో వారిని అదుపు చేసేందుకు వెళ్లిన ఓ పోలీసుకి దెబ్బల బారిన పడ్డాడు. పరిస్థితిని అదుపు చేసేందుకు వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, కొల్లూరు ఎస్‌ఐ జానకీ అమరవర్ధన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.