
నూజిళ్లపల్లిలో పండుగ కళ కరవు
గ్రామోత్సవం నిర్వహణపై పూజారులు, ధర్మకర్తల నడుమ వివాదం గ్రామంలో మోహరించిన పోలీసులు ఫలించని రాజీ ప్రయత్నాలు ఆలయానికి తాళాలు ఇళ్లకే పరిమితమైన గ్రామస్తులు
జె.పంగులూరు: పండగ వేళ పూజలతో కళకళలాడాల్సిన ఇళ్లు బోసిపోయాయి. మేళతాళాలతో మారుమోగాల్సిన వీధులన్నీ పోలీసుల బూటు చప్పుళ్లతో ధ్వనించాయి. దసరా పర్వదినం రోజైన గురువారం నూజిళ్లపల్లి గ్రామంలో నెలకొన్న పరిస్థితి. వివరాలు.. గ్రామంలో రాజరాజేశ్వరిస్వామి వారి దేవాలయం ఉంది. గతంలో విజయదశమి రోజున గ్రామంలో స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఎంతో వైభవంగా ఊరేగించి పండగ జరుపుకునే వారు. ఇది పూజార్లు, ధర్మకర్తలు దగ్గర ఉండి నడిపించేవారు. ఇది పదేళ్ల ముందుమాట. కానీ 2017 నుంచి గ్రామంలో ఆ పరిస్థితులు లేవు. పండగ రోజు కూడా దేవాలయంలో పూజలు, ఊరేగింపులు లేవు. పూజారులంటే ధర్మకర్తలకు పడదు, ధర్మకర్తలు అంటే పూజారులకు పడదు. ఈనేపథ్యంలో గురువారం దేవాలయంలో పూజలు, ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహణపై వివాదం నెలకొంది. వివాదానికి స్వస్తి పలికి గ్రామంలో ప్రశాంతంగా పండగ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూర్యప్రకాష్‌రావు, తహసీల్దార్ పి.సింగారావు, పంగులూరు గ్రూపు దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఉపలమర్తి శ్రీనివాసరావు పలుమార్లు పూజారులు, ధర్మకర్తలతో మాట్లాడారు. గురువారం రాత్రి వరకు వివాదం సర్దుమణిగే విధంగా చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు బయటకు తీయాలంటే ధర్మకర్తలే తీయాలని, పూజారుల పూజకు కూడా ధర్మకర్తలు ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారమయ్యే వరకు తాము అంగీకరించబోమని ధర్మకర్తలు దేవాలయం గడప వద్ద కూర్చున్నారు. ధర్మకర్తలు ఆలయంలో ఉత్సవ విగ్రహాలు బయటకు తీస్తేనే పూజ చేస్తామని పూజారులు భీష్మించుకొని కూర్చున్నారు. పలుమార్లు అధికారులు ఇరువురితో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు రాత్రి 9 గంటల తర్వాత దేవాలయానికి తాళాలు వేయించి వెనుతిరిగి వెళ్లిపోయారు.
భారీ పోలీసు బందోబస్తు
దసరా పండుగ వేళ గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 130 మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, దేవదాయ శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా గ్రామంలోని ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రజలు ఎవరూ ఇల్లు వదిలి బయటకు రాలేదు.
వివాదానికి కారణం భూములు?
దేవాలయానికి 31 ఎకరాల భూమి ఉంది. వాటిలో పూజారులకు 21 ఎకరాలు, ధర్మకర్తలకు మూడు ఎకరాలు, స్వస్తి వాచకులకు నాలుగు ఎకరాలుగా ఉండేదని సమాచారం. అయితే 31 ఎకరాలు పూజారులే అనుభవిస్తున్నారనేది వివాదానికి ప్రధాన కారణం. వివాదాలతో దేవాలయంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. గ్రామస్తుల్లో కొంత మంది పూజారుల వైపు, మరికొంత మంది ధర్మకర్తల వైపు ఉండిపోయారు. రాజకీయరంగు పూసుకుంది.

నూజిళ్లపల్లిలో పండుగ కళ కరవు