
స్థానిక సంస్థల అధికారాలు నిర్వీర్యం
చీరాల రూరల్: స్థానిక సంస్థల అధికారాలను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ పేర్కొన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ భవన్‌లో గ్రామ స్వరాజ్యం, స్థానిక సంస్థలు, నిధులు, విధులు, అధికారాలు అంశాలపై గురువారం రాత్రి సమావేశం నిర్వహించారు. కొత్తపేట మాజీ సర్పంచి చుండూరి వాసు అధ్యక్షత వహించారు. విజయకుమార్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం పల్లెల్లో మచ్చుకై నా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మండల వ్యవస్థ రాక ముందు పంచాయతీలు, సమితులు, జిల్లా పరిషత్‌లకు చెప్పుకోదగిన అధికారాలు ఉండేవని చెప్పారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన గిరిజనులు, ఎస్సీలకు చెందిన సర్పంచి పదవులను అగ్రవర్ణాలకు చెందినవారు దర్జాగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో కగార్ ఆపరేషన్ చేపట్టి అడవుల్లో బతుకుతున్న గిరి పుత్రులను వెళ్లగొట్టి ఆయా భూములను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం యత్నిస్తోందని చెప్పారు. రామాయపట్నం వద్ద పోర్టు పరిసరాల్లోని పేదల భూములను పెత్తందారులు కారుచౌకగా కొట్టేశారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రజలు పార్టీల పేరుతో విడిపోయినంతకాలం అగ్రవర్ణాలవారు ఆధిపత్యాన్ని చెలాయిస్తునే ఉంటారని అభిప్రాయపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఐకమత్యంలో మనఓట్లు మనం వేసుకుంటూ రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సభ కన్వీనర్ చుండూరి వాసు, మాచర్ల మోహనరావు, నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మా, గోసాల ఆశీర్వాదం, మాచవరపు జూలియన్, గవిని శ్రీనివాసరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, దామర్ల శ్రీకృష్ణ, శీలం రవి, జ్యోతి రమేష్, బత్తుల శామ్యూల్, మల్లెల బుల్లిబాబు, రిటైర్డు ఏసీపీ కట్ట రాజ్‌వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్