
నగరం: టీడీపీ నాయకులు బరి తెగించారు. మండలంలోని చల్లమ్మఅగ్రహరం మామిడి తోటల్లో గురువారం జోరుగా కోడి పందేలు వేశారు. వేకువజాము నుంచే కోడిపందేలు వేయడంతో భారీ సంఖ్యలో జనసందోహం హాజరయ్యారు. నిర్వాహకులు పందేలు చేసేందుకు వచ్చిన వారి నుంచి రూ.200 వసూలు చేసినట్లు సమాచారం. ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు జోరుగా కోడిపందేలు నిర్వహించారు. లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.
కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరం పోలీసులు ఉదయం 10.30 గంటల సమయంలో కోడిపందేల బరి వద్దకు వెళ్లారు. నిర్వాహకులను వదిలి చూసేందుకు వచ్చి వారిపై కేసులు నమోదు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడిపందేల శిబిరంపై దాడులు చేసి 14 మంది జూదరులు, మూడు కోడి పుంజులు, ఏడు ద్విచక్రవాహనాలతోపాటు రూ.8760 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ భార్గవ్ తెలిపారు.