
కన్నీటిలోనే లంకలు
కొల్లూరు: కృష్ణమ్మ ప్రకోపానికి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. మూడు రోజులుగా లంక గ్రామాలను వరద తాకిడి వీడకపోవడంతో జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానికుల అత్యవసర సేవల కోసం మూడు ప్రాంతాలలో అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,53,828 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదల చేయగా, సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గింది. 5,93,370 క్యూసెక్కుల వద్ద కొనసాగుతోంది. వరద ఉద్ధృతి కొనసాగుతున్న కారణంగా మూడు రోజుల నుంచి వాణిజ్య పంటలు వరద ముంపులో ఉండటంతో ఎందుకూ పనికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. వేలాది ఎకరాలలో ఉద్యాన పంటలను కృష్ణమ్మ ముంచెత్తడంతో రూ. వేల కోట్లలో రైతులు పంట నష్టానికి గురికానున్నారు.
ప్రాథమిక అంచనా ఇదీ..
వరదల కారణంగా వాణిజ్య పంటలతో పాటు ఇతర పంటలు 7,450 ఎకరాలలో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని పసుపు, కంద, తమలపాకు, అరటి, జామ, మినుము, కూరగాయలు, పూలు, ఇతర పంటలు 2,980 హెక్టార్లలో ముంపునకు గురైనట్లు ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రూ. వేల కోట్లు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వాణిజ్య పంటలు ముంపు బారిన పడటంతో రైతాంగం కోలుకోలేని నష్టానికి గురయ్యారు. చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, తోకలవారిపాలెం, తురకపాలెం, కిష్కిందపాలెం, దోనేపూడి, కొల్లూరు, ఈపూరు, శివరామపురం గ్రామాల పరిధిలోని వాణిజ్య పంటలు ముంపులో చిక్కుకున్నాయి.