
ఫోన్‌పేలో రూ. 5 లక్షల వరకు విద్యుత్ బిల్లు చెల్లింపు
ప్రత్తిపాడు: విద్యుత్ వినియోగదారులు రూ. 5 లక్షల వరకు ఫోన్‌పేలో తమ విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని గుంటూరు రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ బి.చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించడం, బ్యాంక్‌లో చెక్కులు డిపాజిట్ చేయడంతో ఒకటి రెండు రోజులు ఆలస్యమయ్యేవని గుర్తుచేశారు. తద్వారా వినియోగదారుకు సర్‌చార్జీలు పడేవని తెలిపారు. సర్‌ఛార్జీలను బిల్లు ఇచ్చిన పదిహేను రోజుల్లోపు చెల్లిస్తే తరువాతి బిల్లులో రూ.150 వరకు కేటగిరీ–2 వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు. ఇక నుంచి వినియోగదారులు ఫోన్‌పే ద్వారా ఇన్‌టైంలో విద్యుత్ బిల్లులను రూ.లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకు చెల్లించవచ్చన్నారు. తద్వారా వినియోగదారులకు సమయం వృథా కాకుండా ఉంటుందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
జీజీహెచ్‌లో వృద్ధులకు ప్రత్యేక వార్డు
గుంటూరు మెడికల్: ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవంలో భాగంగా బుధవారం గుంటూరు జీజీహెచ్‌లో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ప్రారంభించారు. ఆసుపత్రిలోని కుటుంబ నియంత్రణ విభాగంలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు 15 పడకలతో బేరియాట్రిక్ వార్డును ఏర్పాటు చేశారు. డెంటల్ విభాగంలో రూ.1.20 లక్షలతో ఏర్పాటు చేసిన రేడియో విజియోగ్రఫీ ఎక్స్‌రే యూనిట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశసస్వి రమణ ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను, వార్డుల్లో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు.
సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త వజ్రాల తారక ప్రతాప్‌రెడ్డిని బుధవారం ములాఖత్ ద్వారా ఆయన కలసి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఎటువంటి పోస్ట్‌లు చేయకపోయినా పార్టీలో చురుగ్గా ఉన్న వారిపై కూడా పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయించి, రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిని జైళ్లకు పంపారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదుకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫోన్‌పేలో రూ. 5 లక్షల వరకు విద్యుత్ బిల్లు చెల్లింపు

ఫోన్‌పేలో రూ. 5 లక్షల వరకు విద్యుత్ బిల్లు చెల్లింపు