
మహిషాసురమర్దిని
ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు భవానీలతో ఎరుపెక్కిన ఆలయ పరిసరాలు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ దేవస్థానం నేటి ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతి సాయంత్రం హంస వాహనంపై తెప్పోత్సవం
జయ జయ హే
మహిషాసుర మర్దిని అలంకారంలో హారతులందుకుంటున్న దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీమహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. మహిషాసురమర్దినీదేవి అలంకారం నేపథ్యంలో ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగంతో పాటు శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో రద్దీగా కనిపించాయి. బుధవారం ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు, యాత్రికులే క్యూలైన్‌లో అధికంగా కనిపించారు.
పెరిగిన భవానీలు..
అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు, భవానీలు తెల్లవారుజామున ఆలయం తెరవడంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపున ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి కొండపైకి చేరుకున్నారు. రద్దీ నేపథ్యంలో అన్ని దర్శన టికెట్లు రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ముందుగానే ప్రకటించడంతో రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్లలోనూ భక్తులు విచ్చేసి ఆలయానికి చేరుకున్నారు. సీతమ్మవారి పాదాలు, పద్మావతి ఘాట్, పున్నమి, భవానీ ఘాట్లలో భవానీల తాకిడి కనిపించింది. భవానీల పుణ్యస్నానాలతో నదీతీరం, ఆలయ పరిసరాలు ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్నాయి. అమ్మ వారిని దర్శించుకుని కొండ దిగువకు చేరుకున్న భవానీలు అన్న ప్రసాదం స్వీకరించి, లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరారు.
పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి...
రాజమండ్రి, అనకాపల్లి, రంపచోడవరం, విశాఖ పట్నంలోని మన్యం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు పాదయాత్ర చేసుకుంటూ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి చేరుకునేందుకు 5 రోజులు పట్టినట్లు వారు తెలిపారు. వర్షాలు, ఎండలు, చలికి సైతం తట్టుకుని అమ్మవారిపై భక్తితో ఏటా ఇలా పాదయాత్రగా వస్తుంటామని భవానీలు చెప్పారు. కొంతమంది భవానీల పాదాలకు బొబ్బలు రావడం, వాపులు కనిపించడంతో వారికి వీఐపీ క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించారు.
11 గంటలకు పూర్ణాహుతి
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గత నెల 22వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ దేవీ శర న్నవరాత్రి మహోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి.
గురువారం ఉదయం 11 గంటలకు ఇంద్రకీలాద్రిపై యాగశాలలో మహా పూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తం కానున్నాయి. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది.
పూల పల్లకీపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు పూలపల్లకీపై ఇంద్రగిరి పురవీధుల్లో విహరించారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద పూలతో అలంకరించిన పల్లకీపై శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడమ భక్తజనుల జయజయధ్వానాల మధ్య నగరోత్సవం సాగింది. ఆది దంపతుల నగరోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మహా మండపం, గోశాల, కనకదుర్గ నగర్, ఘాట్‌రోడ్డు మీదుగా నగరోత్సవం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది.
10వ రోజు ఆదాయం రూ.62.16 లక్షలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో 10వ రోజైన బుధవారం దేవస్థానానికి రూ.62.16 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రానికి 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 25,533 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశామని, 11,468 మంది భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించినట్లు అధి కారులు తెలిపారు.
ఇక సింగిల్ లడ్డూ విక్రయం ద్వారా రూ.1.92 లక్షలు, ఆరు లడ్డూల ప్యాక్‌లను విక్రయించడం ద్వారా రూ.54.70 లక్షలు, ఆర్జిత సేవలు, ఇతర సేవల ద్వారా రూ.5.54 లక్షల మేర ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.

మహిషాసురమర్దిని