
వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి
చీరాల రూరల్: వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) టి.చంద్రశేఖర నాయుడు అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో 23 మంది వృద్ధులను ఘనంగా సత్కరించారు. ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు మాట్లాడుతూ మనకోసం– మన క్షేమం కోసం పెద్దలు వారిజీవితాలను పణంగా పెట్టి కొవ్వొత్తుల్లా కరిగిపోతారన్నారు. అటువంటి పెద్దలను మనం గౌరవించుకోవాలని, వారి సూచనలు సలహాలను పాటించి ముందుకెళ్లాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. వృద్ధులను నిర్లక్ష్యం చేసిన 40 కేసులను ట్రిబ్యునల్ జడ్జిగా పరిష్కరించానని, వృద్ధులకు పోలీసు ప్రొటెక్షన్ కూడా ఇచ్చానని వివరించారు. వారిని సక్రమంగా చూడని పక్షంలో వీలునామా, గిఫ్ట్ డీడ్‌లు కూడా రద్దు చేసే అధికారం తన పరిధిలో ఉందని హెచ్చరించారు. ప్రతినిత్యం వృద్ధులు వాకింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. అనంతరం వాకర్స్ సభ్యులు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, సీనియర్స్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి ఎ.నాగవీరభద్రాచారి, చింతా రమేష్, వీరాంజనేయులు, తిరుపతిరావు, ఎంఎస్. సుబ్బారావు, బదరీనాఽథ్, రమేష్, పూర్ణ, దరియాసాహెబ్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ టి.చంద్రశేఖర నాయుడు