
విచారణ తర్వాత సీఐపై తగిన చర్యలు
అంబేడ్కర్ విగ్రహ స్థాపనకు సహకరిస్తాం బాపట్ల ఆర్డీవో గ్లోరియా, డీఎస్పీ రామాంజనేయులు
మార్టూరు: అంబేడ్కర్ విగ్రహ స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ హాలులో సోమవారం సాయంత్రం డేగరమూడి గ్రామంలోని ఇరువర్గాలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడారు. ఆర్డీవో గ్లోరియా మాట్లాడుతూ.. విగ్రహ స్థాపనకు ఎన్నుకున్న స్థలం తాలూకు పూర్వాపరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామ, మండల కమిటీల ఆమోదం అనంతరం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. అనుమతులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అప్పటివరకు గ్రామాల్లోని ఇరువర్గాలు ఎలాంటి విభేదాలు తలెత్తకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు.
సీఐపై చట్టప్రకారం చర్యలు
డీఎస్పీ గోగినేని రామాంజనేయులు మాట్లాడుతూ దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్ కుమార్‌లపై సీఐ శేషగిరి లాఠీచార్జి చేశారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాధిత యువకుల వైద్య పరీక్షల రిపోర్టులు, ఇతర వివరాలను పరిశీలించి ఎస్పీకి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. నిజ నిర్ధారణ అనంతరం సీఐ ప్రమేయం రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ వెల్ఫేర్ డీడీ రాజా దిబోరా మాట్లాడుతూ విగ్రహ స్థాపనకు సంబంధించిన అంశాన్ని జిల్లా పరిషత్ అధికారులతో చర్చించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.