
బిక్కుబిక్కుమంటూ చెట్టు నీడన..
‘సాక్షి’ చొరవతో పునరావాస కేంద్రానికి తరలింపు
కొల్లూరు: పనుల కోసం సొంత ఊళ్లను విడిచి ఏళ్ల తరబడి ఇక్కడే నివాసాలు ఏర్పరుచుకొని జీవిస్తున్న కుటుంబాలకు చెట్టు నీడే పునరావాసంగా మారింది. కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా కొల్లూరు కరకట్ట దిగువన నివసిస్తున్న నిరుపేదల తాటాకుల పాకలలోకి వరద నీరు ప్రవేశించింది. పాకలను వదిలి సమీపంలో ఏడుగురు పసిపిల్లలతో నలుగురు మహిళలు చెట్టు నీడన తలదాచుకున్నారు. సోమవారం వరద నీటి పక్కనే చెట్టు నీడన చిన్నారులతో ఉన్న కుటుంబాలను గమనించిన ‘సాక్షి’ వారి పరిస్థితి గురించి ఆరా తీయడంతో గోడు వెళ్లబోసుకున్నారు. కొల్లూరులో రోజువారీ హోటళ్లతోపాటు, ఇతర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించే వీరు ఏరోజుకు ఆరోజు వచ్చే సంపాదనతోనే జీవనం వెళ్లబుచ్చుతున్నారు. వీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలివెళితే అధికారులు పనులుకు వెళ్లేందుకు అనుమతించకపోతే చేసే పని పోతుందన్న భయంతో చెట్టు నీడనే ఉన్నారు. దీంతో ‘సాక్షి’ వారి పరిస్థితిని తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లింది. తక్షణం స్పందించిన ఆయన.. రెవెన్యూ సిబ్బందిని వారి వద్దకు పంపించారు. పనులకు వెళ్లడానికి అభ్యంతరం ఉండదని భరోసా కల్పించి, వారిని పునరావాస కేంద్రానికి తరలించారు.