
ప్రజల ఫిర్యాదులపై సత్వర చర్యలు
బాపట్ల: ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అర్జీలలోని వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అర్జీలను పరిష్కరించడంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఎస్పీ పోలీస్ అధికారులను హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు, ఇతర పలు సమస్యలపై 56 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీశ్ నాయక్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ బి.ఉమామహేశ్వర్