
ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం దూరం
బాపట్ల: పేదవాడికి అనునిత్యం వైద్యం అందుబాటులో ఉండాలంటే మెడికల్ విద్య ప్రభుత్వంలోనే ఉండాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు వాసుమల్ల వాసు పేర్కొన్నారు. ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టనున్న నిరసన పోస్టర్లను సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాలను నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమవుతోందని, దీన్ని అంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు. మంగళవారం ఉదయం 10గంటలకు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ భవనం వరకు ప్రదర్శన ఉంటుందని, పట్టణ ప్రజలంతా పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బడుగు ప్రకాశ్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి మండే విజయకుమార్, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అడే చందు, జమ్మలపాలెం సర్పంచ్ కటికల యోహోషువా, బాపట్ల నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలపర్తి గోపి, నాయకులు నర్రావుల వెంకట్రావు పాల్గొన్నారు.