
ఆకట్టుకున్న వీణా సింఫనీ
తెనాలి: శ్రీదేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజైన సోమవారం సాయంత్రం తెనాలిలో 108 వీణల ఘన సప్తస్వర సమ్మేళనం (వీణా సింఫనీ) నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) ఆధ్వర్యంలో 108 మంది వైణికుల వాద్య స్వర తరంగాలు ఒకే సమయాన ఆడిటోరియంలో ఆవహించాయి. దివ్యానంద సుడిగాలిలా భక్తులను చుట్టుముట్టాయి. స్థానిక చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఈ ఆధ్యాత్మిక సంగీత యజ్ఞాన్ని వేడుకగా చేశారు. బాలస్వామీజీ స్వయంగా వీణావాదన చేశారు. సరస్వతీ దేవికి ప్రీతిపాత్రం వీణ అని తెలిసిందే. వీణ ధ్వనిని వేదమంత్రాల నాదంతో సమానంగా పరిగణిస్తారు. ఇక 108 సంఖ్య హిందూ సంప్రదాయంలో పవిత్రమైనది. జపమాలలో ఉండే గింజల సంఖ్య 108. అంతమంది వైణికులు ఒకేసారి వీణ వాయించటమంటే జపమాల గింజల్లా ప్రతి స్వరం ఒక మంత్రధ్వనిగా మారటం అన్నమాట! శ్రోతలలో భక్తి, శాంతి, ఆనందం, ఆత్మశుద్ధిని కలిగించే ఆధ్యాత్మిక యజ్ఞంలా జరిగింది. పట్టణానికి చెందిన శ్రీ విద్యా పీఠం, సాలిగ్రామ మఠం, జయలక్ష్మి మాతృమండలి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఆయా సంస్థల బాధ్యులు నంబూరి వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావూరి సుబ్బారావు, ముద్దాభక్తుని రమణయ్య, పల్లపోతు మురళీ మనోహర్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రమణ్యం, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు.