కృష్ణమ్మ ఉగ్రరూపం
కృష్ణమ్మ ఉగ్రరూపం కొల్లూరు: కృష్ణా నదికి వరద పోటెత్తుతుండటంతో లంక గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ఆదివారం ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 6,39,731 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. వరద తీవ్రత తీవ్ర రూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరింది. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని 28 గ్రామాల పరిధిలో అరటి, పసుపు, కంద, మినుము, జామ, కూరగాయల పంటలు ముంపు బారినపడ్డాయి. మండలంలోని ఆవులవారిపాలెం–గాజుల్లంక నడుమ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని దోనేపూడి చినరేవు నుంచి వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో ఉద్యాన పంటలు నీట మునిగాయి. చినరేవు చప్టాపై వరద నీటిమట్టం తీవ్ర స్థాయికి చేరడంతో పది లంక గ్రామాల ప్రజలు వెల్లటూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం మధ్నాహ్నం నుంచి పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాలను వరద చుట్టుముట్టింది. మండలంలోని చింతర్లంక, సుగ్గునలంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం, దోనేపూడి, పోతార్లంక ప్రాంతాలలోని పంట పొలాలలోకి భారీగా వరద నీరు చేరడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో వరద ప్రభావిత కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాలలో పంట నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో కొల్లూరు కరకట్ట దిగువున రహదారిపై వరద నీరు ప్రవహించే ప్రమాదం పొంచి ఉండటంతో జిల్లాలోని తొమ్మిది లంక గ్రామాలతోపాటు, కృష్ణా జిల్లా పరిధిలోని రెండు లంక గ్రామాలు, గుంటూరు జిల్లాలోని మరో రెండు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. వరద తీవ్రత పెరిగితే ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలను తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలో 10 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కృష్ణమ్మ మరోసారి కన్నెరజేసింది. ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి ఆరు లక్షల క్యూసెక్కులకుపైగా విడుదల చేశారు. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నీరు లంక గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునిగాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా నదిలో పోటెత్తుతున్న వరద
రెండో ప్రమాద హెచ్చరిక జారీ
వరద ముంపులో ఉద్యాన పంటలు
పల్లపు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు
రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు
ఆందోళనలో లంక గామాల ప్రజలు
1/1
కృష్ణమ్మ ఉగ్రరూపం