
తల్లిని హత్య చేసిన తనయుడి అరెస్ట్
బాపట్ల టౌన్: మండల పరిధిలోని పూండ్ల గ్రామంలో తల్లిని హత్య చేసిన తనయుడిని బాపట్ల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను శనివారం బాపట్ల రూరల్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి. రామాంజనేయులు వివరించారు. పూండ్ల గ్రామానికి చెందిన పెనిమిటి రమణమ్మ పారిశుద్ధ్య ఎస్‌డబ్ల్యూ షెడ్‌లో రెండో భర్త శ్రీనివాసరావుతో కలిసి పని చేస్తోంది. మొదటి భర్త చనిపోవడంతో ఆమె రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తకు ఇద్దరు సంతానం ఉన్నారు. షెడ్‌లో పనిచేస్తున్న వారికి గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదు. అయితే, ఇటీవల జీతం ఒక్కసారిగా రూ. 42,000 రావడంతో అదే షెడ్డు వద్ద రెండవ భర్తతో కలిసి మృతురాలు, కొడుకు మద్యం తాగుతున్నారు. మృతురాలి కొడుకు జాలయ్య మందు తాగడానికి డబ్బులు అడగడంతో నిరాకరించింది. దీంతో పక్కనే ఉన్న ఇనప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. మృత్యురాలి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని అన్ని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు జాలయ్య హత్య చేసి పారిపోగా చుండూరుపల్లిలో శనివారం అదువులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరుస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు, రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.