
ఇంట్లో అర కిలో బంగారం, వెండి చోరీ
మార్టూరు: మండలంలోని వలపర్ల గ్రామంలో అరకిలో బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు.. వలపర్లకు చెందిన కారంపూడి కొండలు, నాగిని దంపతులు వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు స్థానిక సినిమా హాల్ సెంటర్ సమీపంలో గ్రామానికి దూరంగా ఇటీవల కొత్తగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. దసరా సెలవులు ప్రారంభం కాగానే గత ఆదివారం ఇద్దరు కలిసి కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్న తమ కుమార్తెను చూడటం కోసం వెళ్లారు. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కొండలు దంపతులు ఇంటి తలుపులకు వేసిన తాళం ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. లోపల వైపు తలుపులు బీరువాలు ధ్వంసం చేసి ఉండటానికి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, సంతమాగులూరు సీఐ, బల్లి కురవ ఎస్సైలతో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు.