
పార్టీ శ్రేణులకు భరోసా.. ‘డిజిటల్ బుక్’
కూటమి ప్రభుత్వ వేధింపుల నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్షణకు యాప్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని నేతల హామీ బాపట్లలోని పార్టీ కార్యాలయంలో యాప్ ఆవిష్కరించిన ముఖ్య నేతలు
బాపట్ల: వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ భరోసాగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం ఆరాచకాలు చేస్తోందని పేర్కొన్నారు. పరిపాలనకు పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు వైఎస్సార్‌సీపీ వారిని వేధిస్తోందన్నారు. డిజిటల్ బుక్‌లో తమ సమస్యలను నమోదు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారిస్తామని మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం గొప్ప విషయమన్నారు. శ్రేణులు ఇబ్బందులు ఎదురైతే ఈ యాప్‌లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని కోరారు.
భయపడొద్దు... అండగా పార్టీ ఉంది..
కూటమి ప్రభుత్వ అరాచకాలకు భయపడొద్దని, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి పేర్కొన్నారు. దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో నడుస్తోందన్నారు. లోకేష్ రెడ్‌బుక్ పాలన చూస్తున్న మనకు త్వరలో డిజిటల్ బుక్ పాలన అందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా వీరారెడ్డి, జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, ఇనగలూరి మాల్యాద్రి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, ఎస్సీ సెల్ నాయకులు వడ్డిముక్కల డేవిడ్ , జోగి రాజా, అడే చందు, మోర్ల సముద్రాలగౌడ్, బడుగు ప్రకాశ్, కటికల యోహోషువా తదితరులు ఉన్నారు.