
బాధితులకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి సీఐ దాడిలో గాయపడిన యువకులకు పరామర్శ
మార్టూరు: బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడొద్దని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి అన్నారు. శనివారం మార్టూరు మండలంలోని డేగరమూడి గ్రామానికి చెందిన దళిత యువకులు ప్రమాద్, పోతులూరిలను పరామర్శించారు. మార్టూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన దళిత యువకులను మార్టూరు సీఐ మద్దినేని శేషగిరిరావు అత్యంత క్రూరంగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేసిన ఘటనకు స్పందించిన ఆయన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం యాక్టివ్‌గా ఉన్న వారిపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించారన్నారు. వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ఫ్లెక్సీని చించివేశారంటూ పోలీసే స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారం శాశ్వతం కాదు..
నిజంగా తప్పు చేస్తే కేసు ఫైల్ చేసి శిక్షించాలిగానీ, వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అధికారులను ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిపోతుంటాయని చెప్పారు. దానిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు నడుచుకోవాలని పేర్కొన్నారు. ఈ ఘటనను ఇంతటితో వదలిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసికట్టుగా పోరాడి బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ నాయకులతో మాట్లాడి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వాసు, మార్టూరు మండల పార్టీ కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి ఉప్పలపాటి అనిల్ చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, మార్టూరు టౌన్ అధ్యక్షుడు అడకా గంగయ్య, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి అట్లూరి వెంకయ్య, మండల ఉపాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, మైలా నాగేశ్వరరావు, బూరగ రాము, తమ్మలూరి సురేష్, రాజుపాలెం అంజిబాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిన్న నాయక్, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.