
నిండుకుండలా కృష్ణమ్మ
తగ్గినట్టే తగ్గి ఉగ్రరూపం దాలుస్తున్న వరద ప్రవాహం నేడు 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు చేరొచ్చని అంచనా
కొల్లూరు: కృష్ణమ్మ నిండుకుండలా ప్రవహిస్తోంది. పంటలు ముంపు బారిన పడతాయన్న ఆందోళన రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 2,26,293 క్యూసెక్కులకు నీటి విడుదల పరిమితం కావడంతో వరద ప్రభావం తగ్గిందని ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మధ్యాహ్నం నుంచి వరద తీవ్రత గణనీయంగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రానికి 1,58,232 క్యూసెక్కులు... తర్వాత 3,84,525 క్యూసెక్కులకు చేరింది. ప్రకాశం బ్యారేజ్‌కు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటికి తోడు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం నుంచి ప్రవహించే మున్నేరు వరద కూడా ఉద్ధృత రూపం దాల్చడంతో నదిలో వరద క్రమంగా అధికమైంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.75 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడం కారణంగా మండలంలోని పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాల చుట్టూ నీరు చుట్టుముట్టింది. దోనేపూడి లోలెవల్ చప్టాపై వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పది లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు చుట్టు మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. ఆదివారానికి 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు నీటి విడుదల చేరవచ్చునని ఆర్‌సీ, నీటిపారుదల శాఖాధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నీటి విడుదల పరిమాణం పెరిగిన పక్షంలో శనివారం అర్ధరాత్రి నుంచి బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఆదివారం రెండో ప్రమాద హెచ్చరిక సైతం వెలువడవచ్చునని అధికారులు పేర్కొన్నారు.