
పనులు సకాలంలో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్ల: జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన వివిధ పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. గుంటూరు సర్కిల్ పరిధిలోని పనులకు సంబంధించి శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు సర్కిల్ పరిధిలోని బాపట్ల జిల్లాలో సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని భూములకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 716 పనులు చేపట్టినట్లు, వాటిలో 148 పూర్తి అయ్యాయని, మిగతా పనులు పలు దశలలో ఉన్నాయని జిల్లా వాటర్ రీసోర్సెస్ అధికారి అబా అబుతలీమ్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు.
‘జీఎస్టీ తగ్గింపు’ ప్రయోజనాలపై హెల్ప్ డెస్క్
సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌పై జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జీఎస్టీ కమిషనర్ మురళీకృష్ణతో కలసి శనివారం జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు, జీఎస్టీ కమిషనర్ మురళికృష్ణ, డ్వామా పీడీ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున రావులతో కలసి కరపత్రాలను విడుదల చేశారు.
వసతుల కల్పనకు చర్యలు
జిల్లాలో పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములయ్యే సంస్థలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం పర్యాటక శాఖ అధికారులు, పలు సంబంధిత సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
చెత్త తరలించాలి
బాపట్ల డంపింగ్ యార్డ్‌లోని వ్యర్థాలను నిర్దిష్ట కాలపరిమితిలోపు నిర్దేశిత ప్రాంతానికి తరలించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం బాపట్ల జమ్ములపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డ్‌ను ఆయన పరిశీలించారు.