
విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో పంట సాగుకు వీలుగా రైతులకు పంపిణీ చేయనున్న విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ ప్రకటిస్తూ వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విత్తన సేకరణ, ప్రాసెసింగ్, సరఫరాకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)ను గుర్తించింది. ఈ సారి కే–6 రకంతో పాటు కొత్తగా టీసీజీఎస్–1694, అలాగే కదిరి–లేపాక్షి (కే–1812) విత్తన రకాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో నారాయణి రకాన్ని కూడా ప్రోత్సహించాలని సూచించారు. కే–6, టీసీజీఎస్–1694 రకాలు క్వింటా పూర్తి ధర రూ.9,500 కాగా అందులో 40 శాతం రూ.3,800 సబ్సిడీ పోను రైతులు తమ వాటా కింద రూ.5,700 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నారాయణి రకం క్వింటా పూర్తి ధర రూ.9,700 కాగా, అందులో 40 శాతం రూ.3,880 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,820 ప్రకారం చెల్లించాలి. ఇక కదిరి–లేపాక్షి 1812 రకం పూర్తి ధర క్వింటా రూ.8,700 కాగా 40 శాతం రాయితీ రూ.3,480 పోను రైతులు తమ వాటా కింద రూ.5,220 ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని నిర్ధారించారు. ఒక్కో రైతుకు భూ విస్తీర్ణం బట్టి గరిష్టంగా 90 కిలోలు (30 కిలోలు కలిగినవి మూడు బస్తాలు) పంపిణీ చేయనున్నారు. గిరిజన ప్రాంతాలు కలిగిన జిల్లాల్లో విత్తన వేరుశనగ పై రైతులకు 90 శాతం రాయితీ వర్తింపజేశారు.
త్వరలో రిజిస్ట్రేషన్లు..
ఆర్‌బీకే వేదికగా విత్తన పంపిణీ చేస్తుండగా ఒకట్రెండు రోజుల్లోనే రైతుల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రత్యేక్‌యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విత్తన పంపిణీలో ఎస్సీ ఎస్టీ, కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆర్‌బీకే అసిస్టెంట్లు వెంటనే తమ పరిధిలో విత్తన అవసరాలు, రైతుల రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించాలని నిర్దేశించారు. కాగా ఈ ఖరీఫ్‌లో జిల్లాకు 76 వేల క్వింటాళ్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు 98 వేల క్వింటాళ్లు.. మొత్తం 1.74 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయింపులు చేశారు. రెండు మూడు రోజుల్లోనే జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు కేటాయింపులు, ధరలు, సబ్సిడీ వివరాలు, అలాగే కందులు, ఇతర చిరుధాన్యాల విత్తనాల పంపిణీ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విత్తన పంపిణీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యల గురించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీ) రూపంలో మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఉమ్మడి జిల్లాకు రానున్న
1.74 లక్షల క్వింటాళ్లు
కే–6, టీసీజీఎస్–1694, కే–1812 రకాల కేటాయింపు
విత్తు కోసం రంగంలోకి వ్యవసాయ శాఖ
అనంతపురం అగ్రికల్చర్: విత్తన వేరుశనగ పంపిణీ సన్నాహక చర్యలను వ్యవసాయశాఖ అధికారులు ప్రారంభించారు. ‘విత్తుపై దృష్టి సారించని వ్యవసాయశాఖ’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయశాఖ వెంటనే స్పందించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణం రంగంలోకి దిగారు. అలాగే ఎన్నికల కమిషనర్, వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి కూడా విత్తన పంపిణీ మార్గదర్శకాలు, కేటాయింపులు, ధరలు, సబ్సిడీ వివరాలు కూడా వెల్లడి కావడంతో విత్తన సేకరణ, విత్తన శుద్ధిపై దృష్టి సారించారు. డీఏఓ ఆదేశాల మేరకు అనంతపురం ఏడీఏ ఎం.రవి, ఏఓ శ్రీనాథ్‌రెడ్డి తదితరులు స్థానికంగా ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించి అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధిని పరిశీలించారు. తేమశాతం, ఫిజికల్ ప్యూరిటీ తదితర నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులను ఆదేశించారు.

విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ