
ఈ–తంటా..!
యలమంచిలి రూరల్: అన్నదాతలు వ్యవసాయ సంబంధిత పథకాలు పొందాలన్నా, ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా, పంటల బీమా వర్తించాలన్నా అన్నింటికీ ఈ–పంట నమోదే ప్రామాణికం. కీలకమైన ఈ ప్రక్రియను వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చేపట్టాల్సి ఉంది. శాఖల మధ్య సమన్వయలోపం, ఈ–పంట నమోదుకు సంబంధించి మారిన కొత్త నిబంధనలు, సాంకేతిక అవరోధాల కారణంగా జిల్లాలో ఈ–పంట నమోదు మందకొడిగా సాగుతోంది. రెండుసార్లు గడువు పొడిగించినా ఉద్యాన, వ్యవసాయ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ ఏడాది జూలై మూడో వారం నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ–పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత గత నెల 30లోగా ఈ–పంట నమోదు పూర్తి చేయాలని గడువు విధించారు. ఆ తర్వాత ఈ నెల 15 వరకు గడువు పొడిగించగా, తాజాగా ఈ నెల 25లోగా పంటల నమోదు పూర్తి చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు ప్రకటించారు. అయితే జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే గడువులోగా పంట నమోదు పూర్తయ్యేలా లేదు. దీంతో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుతో తాము నష్టపోతామన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.
సవాలక్ష నిబంధనలు.. 21.8 శాతమే నమోదు
జిల్లా రైతులు ఈ ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు వ్యవసాయం, సామాజిక అటవీ సాగు కలిపి 3.51 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రైతు పేరు, పంట, విస్తీర్ణం తదితర వివరాలను ఖాతా, సర్వే నంబర్ల వారీగా ఈ–పంట యాప్‌లో నమోదు చేయాలి. గతంలో సాగు చేసిన పంటల వివరాలను మాత్రమే నమోదు చేసేవారు. కానీ ఈసారి సాగులో లేని కమతాలను సైతం నమోదు చేయాలని నిబంధన కొత్తగా విధించారు. పంట సాగుచేయని పొలాల్లోనూ రైతులు ఫొటో దిగాల్సి వస్తోంది. పంటల సాగుతో పాటు బీడు భూముల వివరాలను నమోదు చేయిస్తున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో సబ్ డివిజన్ చేయకపోవడంతో జాయింట్ ఎల్‌పీ నంబర్లతోనే విస్తీర్ణం కనిపిస్తోంది. కొన్నిచోట్ల రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడంతో వ్యవసాయ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మారిన నిబంధనల ప్రకారం ఈసారి సర్వే నంబర్ల వారీగా జియో మ్యాపింగ్ చేసి, ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. ఈ తతంగం పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతోంది. సాంకేతిక సమస్యలతో ముందుకు కదలడం లేదు. బయోమెట్రిక్ పడని రైతులకు ఐరిస్ చేయడానికి సిగ్నల్ సమస్య వేధిస్తోంది. ఈసారి తోటల్లో గట్టు మీద పెంచే కొబ్బరి, తాటి చెట్లు, చింత, అల్లనేరేడు ఇతర రకాల చెట్లను ఈ–పంట చేయాలన్న నిబంధన విధించారు. ఇదంతా కష్టతరంగా మారినట్లు సంబంధిత ఉద్యోగులు చెబుతున్నారు. బీడు భూముల నమోదులో సవాలక్ష నిబంధనలు పొందుపరిచారు. కొత్త నిబంధనలతో జిల్లాలో ఈ–పంట నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. జిల్లాలో సాగు, బీడు భూములన్నీ కలిపి మొత్తం నమోదు చేయాల్సిన కమతాలు 17,30,843 కాగా ఇప్పటివరకు 3,77,528 మాత్రమే నమోదయ్యాయి. నమోదు శాతం 21.8 మాత్రమే. గడువు ఈ నెల 25 వరకు పొడిగించినా శతశాతం కమతాల నమోదు అసాధ్యంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు వీఏఏ, ఏవో, వీఆర్వోల వంటి క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం మార్చిన కొత్త నిబంధనల కారణంగా వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యవసాయం, ఉద్యానం సహా జిల్లాలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం 3.51 లక్షల ఎకరాలు
నమోదు చేయాల్సిన మడులు: 17,30,843
ఇప్పటివరకు నమోదు చేసినవి: 3,77,528
నమోదు శాతం: 21.8
లక్ష్యం చేరని పంట నమోదు
కొత్త నిబంధనలతో
క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బందులు
మరోసారి ఈనెల 25 వరకు
గడువు పొడిగింపు