
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చాలా సార్లు ప్రశ్నించాను. స్టీల్‌ప్లాంట్‌కు నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రులు చెబుతున్నా.. ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే కేంద్రం వైఖరి ఉందన్నారు. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ కాపాడుకునేందుకు మనమంతా ఏకతాటిపై వచ్చి పోరాడాలి’ అని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, గాజువాక సమన్వయకర్త దేవన్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామంటే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక వైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 34 విభాగాలను ప్రైవేటీకరిస్తున్నారు. మరో వైపు నుంచి వీఆర్‌ఎస్‌కు వెళ్లని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. దీనిపై నియోజకవర్గ స్థాయిలో పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఉత్తరాంధ్ర స్థాయిలో భారీగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.’ అని అభిప్రాయపడ్డారు.