తెలంగాణ ప్రాంత తాగునీటి అవసరాల కోసం 3 టీఎంసీల నీటిని కృష్ణా జలాల నుంచి కేటాయించాలని కోరు తూ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరారు.
కృష్ణా బోర్డుకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత తాగునీటి అవసరాల కోసం 3 టీఎంసీల నీటిని కృష్ణా జలాల నుంచి కేటాయించాలని కోరు తూ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరారు. తమకు అవసరమైన నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్‌కు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ సోమవారం లేఖ రాశారు. ఇప్పటికే కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం బోర్డును కోరిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు కనీస మట్టమైన 510 అడుగులకు పడిపోవడంతో నీటిని విడుదల చేసే పరిస్థితులు లేవు. ఈ దృష్ట్యా ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ఎగువన ఉన్న శ్రీశైలం నీటినే విడుదల చేయాలి. అక్కడ లభ్యతగా ఉన్న 8 టీఎంసీల మేర నీటిని దిగువకు విడుదల చేసి, వాటినే ఇరు రాష్ట్రాల అవసరాలకు వాడుకోవాల్సి ఉంది. అయితే ముందుగా తమ తాగు నీటి అవసరాలను ఇరు రాష్ట్రాలు బోర్డుకు తెలపాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని 3 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
వర్కింగ్ గ్రూప్ సమావేశం..
శ్రీశైలం నుంచి నీటిని దిగువన సాగర్‌కు విడుదల చేసే అంశమై చర్చించేందుకు రెండ్రోజుల్లో వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగే అవకాశం ఉంది. బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు దీనిపై చర్చించుకొని ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇరు రాష్ట్రాల ఉమ్మడి నిర్ణయం మేరకు ఎంతమేర నీటిని ఎన్ని విడతల్లో విడుదల చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.