సమాజంలోని అణగారిన వర్గాల వారి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం పోరాడిన మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు కొనియాడారు.
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలోని అణగారిన వర్గాల వారి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం పోరాడిన మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు కొనియాడారు. అంబేద్కర్ 59వ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఏపీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రనిధులు డా. వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రుడు, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ అర్జ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏపీభవన్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గురజాడ సమావేశ మందిరంలో ‘అంబేద్కర్ జీవిత చరిత్ర, సాధించిన విజయాలు’ అంశంపై స్పెషల్ కమిషనర్ అధ్యక్షతన చర్చా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూ ప్రొఫెసర్ డా. చిన్నారావు, ఏపీభవన్ సిబ్బందితోపాటు ఢిల్లీలోని పలువురు తెలుగువారు పాల్గొన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గం వారికోసమే పోరాడలేదని, సమాజంలో అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరి స్వేచ్ఛ కోసం పోరాడారని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు అన్నారు.
ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, అన్ని కాలాలకు, అన్ని సమస్యలకు పరిష్కారం చూపగల చెక్కుచెదరని రాజ్యాంగాన్ని రాసిన ఘనత అంబేద్కర్‌దేనని అన్నారు. భవిష్యత్ తరాలు అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జేఎన్‌యూ ప్రొఫెసర్ డా. చిన్నారావు.. అంబేద్కర్ పూణా ఒడంబడిక, రౌండ్‌టేబుల్ సమావేశాలపై వాయిస్ డాక్యుమెంటరీని ప్రదర్శిం చారు. కార్యక్రమంలో ఏపీభవన్ ఇన్ఫర్మేషన్ అధికారి కిరణ్‌కుమార్, ఏపీభవన్ సిబ్బంది, తేవాతోపాటు ఢిల్లీలోని పలు తెలుగు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.