ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించినందుకు మరో కాంగ్రెస్ నాయకుడిపై వేటు పడింది.
జైపూర్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించినందుకు మరో కాంగ్రెస్ నాయకుడిపై వేటు పడింది. ఆదివారం రాజస్థాన్కు ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్ ఆదేశాల మేరకు రాజస్థాన్ పీసీసీ చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాహుల్ బృందంలో జోకర్లున్నారని భన్వర్ లాల్ ఘాటుగా విమర్శించారు. జోకర్ల బృందానికి రాహుల్ ఎండీ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కేరళకు చెందని కాంగ్రెస్ నాయకుడు ముస్తుఫా కూడా రాజకీయ అనుభవం లేని నాయకుల సలహాలను రాహుల్ పాటిస్తున్నారని విమర్శించారు. దీంతో ఆయనపైనా కాంగ్రెస్ వేటు వేసింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో ఎన్నడూలేని విధంగా ఘోరపరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో స్వపక్షం నుంచే గాంధీ కుటుంబం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.