తన చుట్టూ తాను తిరిగే ఇల్లు!

తన చుట్టూ తాను తిరిగే ఇల్లు! - Sakshi


ఆస్తి వ్యవహారాల్లో ఇంటిని ఏమంటామో మీకు తెలుసుకదా... స్థిరాస్తి! కానీ ఫొటోలో ఉన్నది పేరుకు ఇల్లేగానీ... స్థిరంగా మాత్రం ఉండదు. ఎందుకంటారా? ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ పరికరాలను నడిపేందుకు అవసరమైన విద్యుత్తును తయారు చేసేందుకు గుండ్రంగా తిరుగుతుందట! శాంటా క్లారా యూనివర్శిటీ ఇంజనీర్లు చెబుతున్నారు. అవునండి.. వీరు డిజైన్‌ చేసిన ఈ బుల్లి ఇల్లు ఇటీవల అమెరికాలోని శాక్రమాంటోలో జరిగిన ఓ పోటీలో ఫస్ట్‌ ప్రైజ్‌ కొట్టేసింది కూడా. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల టెక్నాలజీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీ జరిగింది. మొత్తం పది దాకా డిజైన్లను పరిశీలించిన తరువాత న్యాయనిర్ణేతలు ఈ డిజైన్‌ను ఓకే చేశారు. దాదాపు 238 చదరపు అడుగుల వైశాల్యమున్న ఈ ఇంటిని స్ట్రక్చరల్‌ ఇన్సులేటెడ్‌ ప్యానెల్స్‌తో కట్టారు. ఈ ఇంటిని వంటగది, బాత్‌రూమ్, లాంజ్‌/బెడ్‌రూమ్‌లుగా విభజించారు.



బయట ఉన్న మెట్ల ద్వారా పైకి ఎక్కితే ఆరుగురు వరకూ కూర్చునేందుకు వీలుగా చిన్న డెక్‌ ఉంటుంది. పైకప్పుపై దాదాపు 330 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. పగలంతా ఉత్పత్తి అయిన విద్యుత్తును దాచేందుకు ఉప్పు ఆధారంగా పనిచేసే బ్యాటరీలను వాడారు. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పెంచేందుకు ఇల్లు మొత్తాన్ని ప్రత్యేకమైన సోలార్‌ ట్రాకింగ్‌ రింగ్‌పై ఏర్పాటు చేశారు. వీలైనంత ఎక్కువ సూర్యరశ్మి ప్యానెల్స్‌పై పడేలా చేసిన ఈ ఏర్పాటుతో దాదాపు 20 శాతం ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇంట్లో ఎయిర్‌ కండీషనర్‌ కాకుండా హెచ్‌వ్యాక్‌ (హీటింగ్, వెంటిలేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌)ను ఏర్పాటు చేశారు. వాడేసిన నీటిని శుద్ధి చేసి మళ్లీ వాడేందుకు, ఇంట్లోని లైటింగ్, కిటికీల నియంత్రణకు ఓ టచ్‌స్క్రీన్‌ తదితరాలు అదనపు హంగులు! త్వరలో ఈ ఇంటిని ‘ఆపరేషన్‌ ఫ్రీడమ్‌ పాస్‌’ అనే సంస్థకు విరాళంగా ఇస్తున్నారు. ఆ సంస్థ మాజీ సైనికులు, ఇతర వికలాంగులకు సాయపడే మూగజీవులకు శిక్షణ ఇస్తుంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top