
జానారెడ్డి నివాసంలో ఆయనతో పాటు కేశవరావుతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కేసీఆర్ వల్లే అన్ని అనర్థాలు... ఇప్పటివరకు ప్లానింగ్‌కే సరిపోయింది
మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్
రాష్ట్ర ఖజానా అంతా కేసీఆరే లూటీ చేశారు
నేను సీఎం అయినప్పుడే ఆయన గుండె పగిలింది
ఎల్కతుర్తి సభలో తన అక్కసు అంతా వెళ్లగక్కాడు
రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు
లాంచింగ్, క్లోజింగ్ పథకాలు నాతో కాదు.. షోపుటప్ స్కీంలు పెట్టను
రాష్ట్ర ప్రజలు మాకు కూడా పదేళ్లు అవకాశం ఇస్తారు
ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని, రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది ఆయనేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రజతోత్సవం పేరుతో ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సభలో ఆయనలో ఉన్న అక్కసునంతా వెళ్లగక్కాడని విమర్శించారు. వాస్తవానికి తాను ముఖ్యమంత్రిని అయిన రోజునే కేసీఆర్ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి వచ్చాక.. అంతకుముందు పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికే ఏడాది కాలం సరిపోయిందని, ఇప్పుడంతా స్ట్రీమ్‌లైన్ (క్రమబద్ధీకరణ) చేస్తున్నామని చెప్పారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. బీఆర్‌ఎస్ సభ, మావోయిస్టుల సమస్య, కేసీఆర్ పాలన, తన పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, రాహుల్‌గాందీతో తనకున్న మైత్రి తదితర అంశాలపై మాట్లాడారు.
ఎవరో అడుగుతున్నారని అరెస్టులు ఉండవు
‘కేసీఆర్ ప్రసంగంలో పస లేదు. బీఆర్‌ఎస్ ఎల్కతుర్తి సభ కంటే నేను గజ్వేల్‌లో పెట్టిన సభే హైలైట్. ఖమ్మంలో జరిగిన రాహుల్‌గాంధీ సభకు బీఆర్‌ఎస్ హయాంలో కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు. కానీ మేం బీఆర్‌ఎస్ నేతలు అడిగినన్ని బస్సులు ఇచ్చాం. తద్వారా ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది. హరీశ్, కేటీఆర్‌లు చిన్నపిల్లలని నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్నే కేసీఆర్ ఎల్కతుర్తి సభలో చెప్పాడు.
మరి పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? కేసీఆర్, మోదీ వారి అవసరాలకు అనుగుణంగా మాట్లా డుతుంటారు. కేసీఆర్ తరహాలో నేను చట్టాన్ని అతిక్రమించి పనిచేయను. ఎవరో అడుగుతున్నా రని అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేది లేదు. చట్టప్రకారమే అన్నీ జరుగుతాయి..’ ముఖ్యమంత్రి అన్నారు.
ఏ పథకమైనా అర్హులందరికీ లబ్ధి చేకూరాలి
‘కేసీఆర్ తరహాలో లాంచింగ్, క్లోజింగ్ పథకాలు నేను పెట్టలేను. షోపుటప్ స్కీంలు నాతో కాదు. ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులందరికీ లబ్ధి కలిగేంతవరకు పనిచేస్తా. రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా. ఇప్పటివరకు ప్లానింగ్‌కే సమయం సరిపోయింది. ఇక నుంచి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. పథకాల గ్రౌండింగ్ చేస్తాం. అయితే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడంలో కూడా మేము వెనుకబడ్డాం.
ఏడాదిన్నరలోనే ఎన్నో పథకాలు
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో పథకాలు తీసుకువచ్చాం. ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం. మేము అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు. బీఆర్‌ఎస్ తరహాలో మాకు కూడా తెలంగాణ ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తారు. వాస్తవానికి నా పాలన, పథకాల అమలుపై ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చర్చ జరుగుతోంది..’ అని రేవంత్ చెప్పారు.
రాహుల్‌తో మంచి సంబంధాలున్నాయి
‘రాహుల్‌గాంధీతో నా స్నేహం గురించి నాకు తెలిస్తే చాలు. ఎవరో ఏదో చెబితే వినాల్సిన పనిలేదు. ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి. మా ఇద్దరి గురించి బయటి వారు ఏం మాట్లాడుకుంటున్నారనేది నాకు అవసరం లేదు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన రాజకీయ యోధురాలు లేరు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెది.
వేరే ఆప్షన్ లేకే ఆ అధికారుల కొనసాగింపు
పాలన అవసరాలను బట్టి అధికారులను వినియోగించుకుంటాం. కొందరు అధికారుల గురించి అన్ని విషయాలు తెలిసినా వేరే ఆప్షన్ లేకపోవడంతో కొనసాగించాల్సి వస్తోంది. కలెక్టర్లను మార్చుకునే వెసులుబాటు ఉంది కనుకనే మారుçస్తున్నాం.
సీపీఐ, ఎంఐఎంకు అండగా ఉన్నా..
నేను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మర్చిపోను. నన్ను నమ్మిన సీపీఐకి, ఎంఐఎంకు అండగా ఉన్నా. అద్దంకి దయాకర్‌కు పదవి ఇప్పించగలిగా. దయాకర్ ఓపికతో ఉన్న కారణంగానే పదవి వచ్చింది. ఓపికతో ఉంటేనే నాకు కూడా బాధ్యత ఉంటుంది. అవకాశాలు వస్తాయి. అలా కాదని బయటకు వచ్చి స్లీపింగ్ రిమార్కులు చేస్తే నాపై భారం తగ్గించినట్టే అవుతుంది. పదవి ఇవ్వలేని పరిస్థితికి, వారి మాటలకు చెల్లుకు చెల్లు అయినట్టు నేను ఫీల్ అవుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఎంత చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు వినడం లేదు
‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు హైదరాబాద్ వదిలి వెళ్లలేకపోతున్నారు. మీడియా చుట్టూ తిరిగేందుకే పరిమితం అవుతున్నారు..’ అని సీఎం వ్యాఖ్యానించారు.
మావోయిస్టులపై పార్టీ నిర్ణయమే ఫైనల్
‘ఆపరేషన్ కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. మావోయిస్టుల విషయంలో పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం..’ అని రేవంత్ తెలిపారు.
జానా నివాసంలో ‘కగార్’పై చర్చలు
లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార కార్యక్రమానికి సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ జానారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. ఆపరేషన్ కగార్ గురించి చర్చించారు. మావోయిస్టుల సమస్యకు సంబంధించి శాంతి చర్చల కమిటీ ఆదివారం తనతో సమావేశం కావడాన్ని, తాను చొరవ తీసుకుని కేంద్రాన్ని శాంతి చర్చలకు ఒప్పించేలా చూడాలని వారు కోరిన విషయాన్ని తెలియజేశారు.
గతంలో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా, కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో.. శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనలపై ఏం చేయాలన్న దానిపై వారితో చర్చించారు. అక్కడి నుంచే ఏఐసీసీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, చిదంబరంలతో సీఎం మాట్లాడారని సమాచారం. కాగా శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపాలని సమావేశంలో నిర్ణయించారు.