
డొక్కు బస్సులతో ఇక్కట్లు
సాక్షి,పాడేరు: ఆర్టీసీ డొక్కు బస్సులతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడంలేదు. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు సర్వీసు చేస్తున్న కొన్ని ఆర్టీసీ బస్సులు తరచూ మరమ్మతులతో నిలిచిపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖ,పాడేరు డిపోలకు చెందిన పలు బస్సులు పాతవి కావడంతో ఘాట్‌రోడ్డులో ప్రయాణ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. బస్సులు నిలిచిపోతుండడంతో వెనుక వచ్చే మరో ఆర్టీసీ బస్సు కోసం ప్రయాణికులు రోడ్డుపై పడిగాపులు కాయాల్సి వస్తోంది. మంగళవారం సాయంత్రం పాడేరు నుంచి అనకాపల్లి వెళుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు మినుములూరు డౌన్‌లో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మరో బస్సు కోసం చాలా సమయం నిరీక్షించారు. పాడేరులో ఘాట్ రోడ్డులో పూర్తిస్థాయి కండీషన్‌లో ఉన్న బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.