ఏబీ స్విచ్‌లు ఏవీ..?

Installation Of Transformers Without On And Off Switch - Sakshi

ఆన్, ఆఫ్‌ స్విచ్‌ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు 

సబ్‌స్టేషన్‌ నుంచి ఎల్‌సీ ఇచ్చేలోగా ప్రమాదాలు 

ఆరు నెలలుగా ఇదే దుస్థితి.. ఆందోళనలో అన్నదాతలు 

మెదక్‌జోన్‌: కరెంట్‌తో ఎంత మేలు జరుగుతుందో అశ్రద్ధ చేస్తే అంతకు రెట్టింపు కీడు చేస్తోంది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. ఆరు నెలలుగా జిల్లాలో నూతనంగా బిగిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లకు ఏబీ స్విచ్‌ (ఆన్,ఆఫ్‌)లు అమర్చడం లేదు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని క్షేత్రస్థాయి అధికారులతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు.

♦ జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. కానీ చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో అధికంగా రైతులు బోరుబావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.  

♦ ఇప్పటికే జిల్లాలో 1.98 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా మరొక 30 వేల బోర్లు ఉన్నాయని సమాచారం. 

♦ గతంలో 10 నుంచి 16 బోరుబావులకో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చేవారు. వాటిపై లోడ్‌ ఎక్కువ కావడంతో తరుచూ కాలిపోయేవి. 

♦ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పాటు 3 నుంచి 4 బోరుబావులకు ఒక 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చుతున్నారు.  

♦ దీంతో ఒక్క రైతు పొలంలో 3 నుంచి 4 బోర్లు ఉన్నా ఆ రైతుతో 4 డీడీలు కట్టించుకుని సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను సదరు రైతు పొలంలోనే అమర్చుతున్నారు.  

♦ ఇంతవరకు బాగానే ఉన్నా ఆరు నెలలుగా ఏబీ స్విచ్‌లను బిగించకుండానే రైతుల పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను బిగిస్తున్నారు.  

♦ దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏబీ స్విచ్‌ ఉంటే సదరు రైతు పొలంలో స్టార్టర్‌ డబ్బా వద్ద ఏమైనా సమస్య ఉత్పన్నమైన, ఫ్యూజ్‌ వైర్‌ పోయినా ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్‌ చేసుకుని మరమ్మతులు చేసుకుంటాడు.   

♦ అయితే ఆసౌకర్యం లేకపోవడంతో సంబంధిత సబ్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి ఎల్‌సీ (లైన్‌) నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈక్రమంలో ఒక వ్యక్తి ఎల్‌సీ తీసుకోవాలంటే కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది.  

♦ సామాన్య రైతులకు ఎల్‌సీ ఇవ్వడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతుల వద్ద సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే ఆపరేటర్‌ ఫోన్‌ నెంబరే ఉండదు. 

♦ ఆలోపల ఏదైన ప్రమాదం ఉత్పన్నమైనప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరు నెలలుగా వందల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లను బిగించారు. వాటికి కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చి వినియోగంలోకి తెచ్చారు. కానీ ఏబీ స్విచ్‌లు మాత్రం అమర్చలేదు. 

నేటికీ స్టోర్‌ రూం కరువు.. 

♦ జిల్లా ఏర్పాటై నాలుగేళ్లు గడిచినా విద్యుత్‌ సామగ్రితో పాటు ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వకోసం జిల్లాలో నేటికీ స్టోర్‌ రూం ఏర్పాటు చేయలేదు. దీంతో అత్యవసరంగా వైర్‌ కావాలన్నా, ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన ఏదైనా పరికరాలు కావాలన్నా సంగారెడ్డికి పరుగులు పెడుతున్నారు. 

♦ కొన్ని సందర్భాల్లో సామగ్రి సమయానికి అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఉన్నతాధికారులకు విన్నవించాం
జిల్లాలో ఏబీ స్విచ్‌ల కొరత ఉన్నమాట వాస్తవమే. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అలాగే జిల్లాకు స్టోర్‌ రూం లేక విద్యుత్‌ పరికరాల కోసం సంగారెడ్డి వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ప్రభుత్వ భూమి ఇచ్చి స్టోర్‌ రూం నిర్మిస్తామని చెప్పారు.
– జానకిరాములు, ఎస్‌ఈ విద్యుత్‌శాఖ మెదక్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top