
‘మధ్యాహ్న భోజనం’ బిల్లులేవి..!
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో కొన్ని చోట్ల నిర్వాహకులు వంటలు నిలిపి వేస్తుండడంతో ఉపాధ్యాయులు గరిట పట్టాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన నిర్వహణను సంయుక్తంగా అమలు చేస్తుండగా.. రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పేరుకుపోతున్న బకాయిలు వెరసి మధ్యాహ్న భోజనం నిర్వహణపై ప్రభావం పడుతోంది. సన్న బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తుండగా.. కూరగాయలు, కోడిగుడ్లు ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మెనూ ప్రకారం పాఠశాల పని దినాల్లో ఆరు రోజుల్లో మూడు రోజులు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు అప్పు చేసి కొనుగోలు చేస్తుండగా.. బిల్లులు సకాలంలో రాక ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని 747 పాఠశాలల్లో 37,241 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు 1,249మంది ఉన్నారు. వంట ఏజెన్సీ మహిళలకు 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు రూ.6.19, 6నుంచి 8వ రతగతి వరకు రూ.9.29, 9వ, 10వ తరగతికి రూ.11.17 చెల్లిస్తుంటారు. కూరగాయలు, పప్పులు, నూనెలు వంట ఏజెన్సీలు సమకూర్చుకుంటాయి. నెలనెలా బిల్లులు, గౌరవ వేతనం సక్రమంగా చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నెలకు 1నుంచి 5వ తరగతి వరకు రూ.18,68,657, 6నుంచి 8వరకు రూ.6,22,883 కుకిింగ్ కాస్ట్ చెల్లిస్తుంటారు. కుక్‌కమ్ హెల్పర్‌కు రూ.1000 చొప్పున రూ.13,27,997, 9నుంచి 10వ తరగతి వరకు జనరల్ విద్యార్థులకు రూ.10,98,448, ఎస్సీలకు రూ.7,16,941, ఎస్టీలకు రూ.1,02,769 కుకింగ్ కాస్ట్ చెల్లిస్తున్నారు.
చెల్లింపుల్లో జాప్యం..
కోడిగుడ్ల బిల్లు, కుకింగ్ కాస్ట్, గౌరవ వేతనం చెల్లింపునకు విడతల వారీగా బడ్జెట్ రావడంతో వంట ఏజెన్సీలకు ఏ బిల్లు వచ్చిందో తెలియక తికమక పడుతున్నారు. ఒకటి నుంచి 8వ తరగతికి సంబంధించిన కుకింగ్ కాస్ట్ బిల్లులు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు దాదాపు రూ.38లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వంట కార్మికులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి చెల్లిస్తుంది. గౌరవ వేతన బకాయిలు రూ.24.21లక్షలు, 9వ తరగతికి కుకింగ్ కాస్టు బిల్లులు ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.42.91లక్షలు విడుదల కావాల్సి ఉంది. కోడిగుడ్ల బిల్లులు(1నుంచి 8వ తరగతి వరకు ఏప్రిల్ నుంచి) రూ.43.97లక్షలు చెల్లించకపోవడంతో వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
నిర్వాహకుల ఆందోళన
దండేపల్లి: ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు రావడం లేదని మండలంలోని ఉన్నత పాఠశాలల భోజన నిర్వాహకులు సోమవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎఈవో రాజుకు వినతిపత్రం అందజేశారు. భోజన, కోడిగుడ్ల బిల్లులు, గౌరవ వేతనాలు రావడం లేదని, వంట చేసేందుకు అప్పుల పాలవుతున్నామని వాపోయారు. ఈ నెల 4నుంచి పాఠశాలల్లో వంట చేయడం మానేశామని తెలిపారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉన్నత పాఠశాలల భోజన నిర్వాహకులు పాల్గొన్నారు.
గ్రీన్‌చానల్‌కు కసరత్తు
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రతీ నెల 10లోగా గ్రీన్‌చానల్ ద్వారా బిల్లులు చెల్లింపునకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వంట బిల్లులను ప్రధానోపాధ్యాయులు మండల విద్యావనరుల కేంద్రానికి పంపిస్తున్నారు. ఎంఈవో పరిశీలించి జిల్లా విద్యాశాఖకు.. అక్కడ మధ్యాహ్న భోజన ఇంచార్జి పరిశీలించి ఉన్నతాధికారులకు పంపిస్తే బిల్లులు మంజూరవుతాయి. దీంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఇక నూతన విధానంతో ట్రెజరీ నుంచి నిర్వాహకుల ఖాతాల్లో బిల్లులు జమ కానున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ నుంచి గ్రీన్ చానల్‌తో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ సాగనుంది.