
నీటివనరుల పరిరక్షణ అందరి బాధ్యత
మంచిర్యాలఅగ్రికల్చర్: నీటి వనరుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని జాతీయ జల మిషన్ డైరెక్టర్ అర్చనవర్మ అన్నారు. సోమవారం జాతీయ స్థాయి 51వ వెబినార్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో భగీదారి కార్యక్రమంలో నీటి వనరుల ఆవశ్యకత, పరిరక్షణ బాధ్యతలపై చేపట్టిన చర్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల సంచాయి, జన భగీదారి కార్యక్రమం జల సంరక్షణలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం వల్ల విజయవంతంగా నిర్వహించారని, ఇందుకు రూ.2కోట్ల అవార్డుకు అర్హులయ్యారని తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 43,545 ఇంకుడు గుంతలు, 5,372 సామాజిక ఇంకుడుగుంతలు జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఏర్పాటు చేశామని, తద్వారా భూగర్భ జల పరిమితి పెరిగిందని తెలిపారు. ప్రతీ ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి నాటి సంరక్షించేలా చర్యలు తీసుకున్నామని, గత మూడేళ్లలో 45 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.