
బాణసంచా తయారీలో మూడు తరాలుగా..
రాయవరం: గ్రామం సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాన్ని మూడు తరాలుగా ఒకే కుటుంబం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడి నుంచే బాణసంచా తయారీ కుటీర పరిశ్రమగా ప్రారంభమైంది. స్వాతంత్య్రానికి పూర్వమే వెలుగుబంట్ల వీరన్న బాణసంచా తయారీని ప్రారంభించినప్పటికీ వారి కుమారులు తాత నారాయణమూర్తి, రామకృష్ణల హయాంలోనే అభివృద్ధి చెందింది. తాత నారాయణమూర్తి కుమారుడు వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు), రామకృష్ణ కుమారుడు కోటిబాబులు వేర్వేరుగా వ్యాపారాన్ని సాగించారు. కోటిబాబు మరణించే వరకు ఈ వృత్తిని కొనసాగించగా, వారసులు వృత్తికి స్వస్తి పలికారు. ఇదిలా ఉంటే సత్యనారాయణమూర్తి మాత్రం బాణసంచా తయారీని కొనసాగిస్తున్నారు. దీపావళి పర్వదినానికే కాకుండా వివాహాది శుభకార్యాలకు, గ్రామాల్లో జరిగే అమ్మవారి జాతర్లు, రాజకీయ పార్టీల ఊరేగింపులు, ఉత్సవాలకు బాణసంచా తయారీ చేస్తున్నారు. 1952లో మద్రాస్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశం, 1978లో బెంగళూరులో జరిగిన జాతీయ క్రీడలకు, 1983లో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, 1983, 1999లలో ఫిలిం ఫెస్టివల్స్‌కు, పలు చలన చిత్రాల శత దినోత్సవాలకు వెలుగుబంట్ల సోదరులు తయారుచేసిన బాణసంచా కాల్చారు. వాటి తయారీలో ప్రత్యేక స్థానాన్ని సాధించి నిశిరాత్రిలో వెలుగుపూలు నింపిన వెలుగుబంట్ల సత్తిబాబు అదే బాణసంచా ప్రమాదానికి గురికావడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న సత్తిబాబు మృతితో ఆయన అభిమానులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
లోతైన దర్యాప్తు చేయాలి
రాయవరం: గ్రామంలో చోటు చేసుకున్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు దుర్ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. బాణసంచా ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. మరణాలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో స్కిల్డ్ లేబర్ మాత్రమే పనిచేయాలన్నారు. ఎంతమంది నిపుణులైన కార్మికులు పనిచేస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదన్నారు. సరైన పర్యవేక్షణ చేస్తున్నారా? లేదా? అనేది ప్రభుత్వం చూడాలన్నారు. పీరియాడికల్ తనిఖీలు చేపడుతున్నారా? లేదా? అన్నది కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారా? లేదా? అన్నది కూడా చూడాలన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది పనిచేస్తున్నారో చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారన్నారు. జగ్గిరెడ్డి వెంట మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గా భవాని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాసరావు, పార్టీ నేతలు వెలగల సత్యనారాయణరెడ్డి, కుడుపూడి రాంబాబు, తమలంపూడి గంగాధరరెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్సీ తోట దిగ్భ్రాంతి
కపిలేశ్వరపురం (మండపేట): కొమరిపాలెంలో బుధవారం సంభవించిన బాణసంచా పేలుడు ఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులో ఉన్న ఆయన ఈ మేరకు వీడియో సందేశాన్ని పంపి మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను కోరారు. కార్మికులకు బీమా సదుపాయం కల్పించిన తరువాతే బాణసంచా తయారీ సంస్థలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

బాణసంచా తయారీలో మూడు తరాలుగా..