సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దీపావళి వేళ ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రిక ముందుగానే హెచ్చరించింది. ఈ నెల ఒకటో తేదీన ‘అలక్ష్యంతో అనర్థం’, నాలుగో తేదీన ‘ప్రాణ సంకటంగా బాణసంచా’ శీర్షికలతో కథనాలను ప్రచురించింది. దీపావళి సమయాల్లో గతంలో జరిగిన ప్రమాదాలను ఊటంకిస్తూ.. అధికారులు పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపింది. అయినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. తయారీ కేంద్రాన్ని ఇటీవల సందర్శించామని, అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయినా ఇంత ప్రమాదం జరగడం స్థానికులను విస్మయ పరుస్తోంది.