
కొవ్వాడలో పట్టపగలు చోరీ
● 50 కాసుల బంగారు ఆభరణాల
అపహరణ
● సొత్తు విలువ రూ.40 లక్షలు
కాకినాడ రూరల్: మండలంలోని కొవ్వాడ గ్రామంలో పట్టపగలే భారీ చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి గేటు, తలుపు తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించిన దొంగలు.. బీరువాలోని బంగారు ఆభరణాలు కొల్లగొట్టారు. ఇంద్రపాలెం పోలీసుల వివరాల మేరకు, కిర్లంపూడి ఎంఈఓ మక్కా చిన్నారావు కొవ్వాడలో నివసిస్తున్నారు. ఆయన భార్య విద్య మాధవపట్నంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. సోమవారం ఉదయం 8.30కు ఇంటి తలుపులు వేసి, బయట గేటుకు తాళం వేసి వారు విధులకు వెళ్లిపోయారు. సాయంత్రం 4.30కు తిరిగొచ్చేసరికి గేటు తాళం పగులగొట్టి ఉన్నట్టు గుర్తించారు. లోనికి వెళ్లిచూడగా.. ఇంటి తలుపు తాళం తెరిచి, గదిలోని బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. సుమారు 50 కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించారని, వీటి విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారావు ఫిర్యాదు మేరకు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ చైతన్యకృష్ణ ఈ వివరాలను మంగళవారం రాత్రి మీడియాకు తెలిపారు.