
రీజెన్సీ తెరిచేందుకు ప్రజా మద్దతు అవసరం
యానాం: రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ పునఃప్రారంభానికి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ఎంపీల బృందం త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్టు ఆ సంస్థ ఎండీ డాక్టర్ జీఎన్ నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక ఐఏఎస్ అఽధికారి, ఆర్‌ఏఓ అంకిత్‌కుమార్‌ను ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు ఆయన కలిసారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాది క్రితం సీఎం రంగసామితో చర్చించిన అనంతరం రూ.30 కోట్ల పెట్టుబతో మెషినరీ అమర్చినట్టు తెలపారు. గెయిల్ ద్వారా వచ్చే గ్యాస్ నిలిపివేయడంతో ఆ పైపులు తుప్పుపట్టాయని, వాటికి అయ్యే రూ.80 కోట్ల వ్యయాన్ని తామే భరిస్తామని, ఫ్యాక్టరీ ప్రారంభమైతే వచ్చే రెవెన్యూ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లిస్తామని వారిని కోరినట్టు తెలిపారు. సంస్థకు సహజవాయువు కేటాయింపుపై అక్టోబర్ 15వ తేదీలోగా ఎంపీల బృందం ప్రధానిని కలవనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల నుంచి సైతం రీజెన్సీ తెరవాలని ప్రజల మద్దతు తెలిసేలా పోరాటం చేయాలని ఆయన అన్నారు. 2012 జనవరి 27న జరిగిన ఫ్యాక్టరీ విధ్వంసం తదనంతర పరిణామాలు, ఇద్దరు మృతి ఘటనలపై సీబీఐ విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయుడు కోరారు. 665 మంది కార్మికులకు 25 ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. వారు సైతం వాటిలో నివాసాలకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో వారితో పాటు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పాల్గొన్నారు.
సంస్థ ఎండీ జీఎన్ నాయుడు
సహజవాయువు కేటాయింపుకై ప్రధానిని కలవనున్న
ఎంపీల బృందం