తగ్గుతూ... పెరుగుతూ... | - | Sakshi
Sakshi News home page

తగ్గుతూ... పెరుగుతూ...

Oct 1 2025 10:11 AM | Updated on Oct 1 2025 10:11 AM

తగ్గుతూ... పెరుగుతూ...

తగ్గుతూ... పెరుగుతూ...

లంకవాసులతో వరద దోబూచులాట

ఐ. పోలవరం/ పి.గన్నవరం/ అయినవిల్లి/ మామిడికుదురు: గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ లంక వాసులతో దోబూచులాడుతోంది. అసలు సెప్టెంబర్‌ నెలాఖరున వరద రావడమే అరుదైన విషయం అనుకుంటే వరద వచ్చి తగ్గి తిరిగి మళ్లీ పెరుగుతుండటం మరింత అరుదైన విషయంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి ఆరు గంటలకు గోదావరి వరద 9,59,784 క్యూసెక్కులుగా ఉంది. ఆ తర్వాత నుంచి వరద క్రమేపీ పెరుగుతోంది. రాత్రి 7 గంటల సమయంలో ఇది 9,77,625 క్యూసెక్కులకు పెరిగింది. మంగళవారం ఉదయం నాలుగు గంటలకు 10.09 లక్షలకు, ఆరు గంటలకు 10.14 లక్షలకు, 10 గంటలకు 10.20 లక్షలకు, 12 గంటలకు 10.25 లక్షలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు 10.30 లక్షలకు, రెండు గంటలకు 10.35 లక్షలకు, సాయంత్రం 6 గంటలకు 10,90 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

గోదావరి వదర తగ్గుతుంది అనుకుంటున్న సమయంలో వరద పెరగడం లంక వాసులను ఇబ్బందులు పాలు చేస్తోంది. పి.గన్నవరం మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయలంక, అనగారిలంక, శిర్రావారిలంక, అయోధ్యలంకలకు చెందినవారు పడవల మీదే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. గంటి పెదపూడిలంక, బూరుగులంక, ఉడుమూడిలంక, అరిగెలవారిపేటలకు ఇప్పటికే పడవల మీద రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. తాజా వరదకు కనకాయిలంక కాజ్‌ వేతో పాటు మామిడికుదురు మండలం అప్పనపల్లి, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం, సఖినేటిపల్లి మండలం అప్పనిరామునిలంక కాజ్‌వేలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఎదురుబిడియం కాజ్‌వేపై పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. ముమ్మిడివరం మండలం లంకా ఆఫ్‌ ఠాన్నేల్లంక, కమిని, గురజాపులంక, కాట్రేనికోన మండలం పల్లంకురు రేవు, బలుసుతిప్ప, అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో మత్స్యకార కాలనీల్లో ఇళ్ల మధ్యకు వరద నీరు వచ్చి చేరింది. దీనితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు, తోటల్లో వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. ఇప్పటికే నాలుగైదు సార్లు వరద తాకిడికి గురి కావడం వల్ల లోతట్టు లంక పొలాల్లోని కూరగాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

ఎగువన పెరుగుతున్న వరద ప్రభావం దిగువన కోనసీమ లంక గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి కనిపించనుంది. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటలకు 12.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఉన్న ముంపు మరింత పెరగనుంది. అప్పనపల్లి కాజ్‌వే మీద రాకపోకలు నిలిపివేసే అవకాశముందని అంచనా. జిల్లాలో కోటిపల్లి– ముక్తేశ్వరం, సఖినేటిపల్లి– నర్సాపురంతోపాటు పలు రేవుల్లో పడవ ప్రయాణాలను నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement