
నేడు యూటీఎఫ్ రణభేరి
రాయవరం: సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రణభేరి పేరుతో మోటార్ సైకిల్ జాతా నిర్వహించారు. యాప్‌ల పని భారం తగ్గించాలని, బోధనేతర పనులు వద్దని కోరుతూ, అలాగే వారి ఆర్థిక సమస్యల నేపథ్యంలో గురువారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వెళ్తున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా యూటీఎఫ్ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, సుబ్బారావు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో
అహోరాత్ర లలితా పారాయణ
ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో తృతీయ అహోరాత్ర లలితా సహస్ర నామ పారాయణ అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా లలితా భక్త మండలి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మొదలైన ఈ పారాయణ మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఆలయ అర్చకులు, పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ సహాయ కమిషనర్, ఈవో వి.సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వంతెన పనులు
పరిశీలించిన ఏఐఐబీ బృందం
పి.గన్నవరం: ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం వశిష్ట నదిపాయపై రూ.71.42 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐ బీ) ప్రతినిధుల బృందం బుధవారం పరిశీలించింది. వరదల సీజన్‌లో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూ రుగులంక గ్రామాల ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో పడవలపై రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో వంతెన నిర్మాణ పనులను అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన విషయం విదితమే. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల రూ.21 కోట్లు విడుదల చేసింది. వంతెన నిర్మాణ పనులను ఏఐఐబీ ప్రతినిధుల బృందం ప్రతినిధి పవన్ కార్కి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అశోక్‌కుమార్, సోషియల్ ఎక్స్‌పర్ట్ శివరామకృష్ణ, ఏవీఎస్ శ్రీనివాస్, పీఆర్ ప్రాజెక్టు విభాగం ఎస్‌ఈ ఏవీఎస్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో వారు చర్చించారు. ఇంత వరకూ 60 శాతం మేర పనులు జరిగినట్టు కాంట్రాక్టు సంస్థ అధినేత పీపీ రాజు, పీఆర్ డీఈఈ అన్యం రాంబాబు ఆ బృందానికి వివరించారు. ఇప్పటి వరకూ జరిగిన పనులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫినిషింగ్ పనులు పూర్తి కాకపోయినా, వచ్చే వరదల సీజన్ నాటికి ప్రజలు వంతెనపై నడచి వెళ్లేలా అవకాశం కల్పించాలని కార్కి సూచించారు. ఈ సందర్భంగా ఏఐఐబీ ప్రాజెక్ట్ మేనేజర్ పీవీ రమణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏఐఐబీ ద్వారా రూ.3,520 కోట్లతో 4 వేల కిలోమీటర్ల మేర రోడ్లు, ఆరు హై లెవెల్ వంతెనలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. మూడు వంతెనలు 50 శాతం మేర, మరో మూడు వంతెనలు 25 శాతం మేర పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈఈ పులి రామకృష్ణారెడ్డి, ఏఈఈ పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నేడు యూటీఎఫ్ రణభేరి

నేడు యూటీఎఫ్ రణభేరి