
అరటి ఫైబర్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి
అమలాపురం రూరల్: పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీలో భాగంగా అరటి ఫైబర్ యూనిట్లు స్థాపించి రైతుల జీవనోపాధి మెరుగుపర్చాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఉద్యాన, పరిశ్రమల కేంద్రం అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరంలో అరటి నార ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను సందర్శించి, అరటినార ఆధారిత చేతివృత్తి ఉత్పత్తుల తయారీ ప్రక్రియను ఉద్యాన అధికారి బీవీ రమణతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు గురించి ఉద్యాన అధికారి రమణ కలెక్టర్‌కు వివరించారు. రావులపాలెం మండలంలో అరటి నార సేకరిస్తున్నారని, దీంతో రాజమహేంద్రవరంలో చేతివృత్తి ఉత్పత్తుల తయారీ జరుగుతోందన్నారు. అరటి సాగవుతున్న రావులపాలెం ప్రాంతంలో అరటి నార ఉత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని పెంచడంతో పాటు, గ్రామీణ స్థాయిలో చిన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను అరటి ఫైబర్ పరిశ్రమ సృష్టించగలదన్నారు. కోనసీమ జిల్లాలో సుమారు 24 వేల ఎకరాల్లో అరటి సాగు జరుగుతోందని చెప్పారు. ఒక్కో చెట్టుకు 200 గ్రాముల అరటి నార, పది కిలోల వ్యర్థాన్ని ఉత్పత్తి చేస్తాయని, దీని ద్వారా ఎకరానికి 160–200 కిలోల అరటి నార సేకరించవచ్చన్నారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కిలో నార రూ.200 ఉండటంతో, రైతులకు ఎకరానికి రూ.32 వేల నుంచి రూ.40 వేల అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.
సత్వర న్యాయం చేయాలి
అట్రాసిటీ కేసుల్లో బాధితుల రక్షణ, దోషులకు శిక్షలు, బాధితుల పునరావాసంతో పాటు, సత్వర న్యాయానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పౌర హక్కుల రక్షణ చట్టంపై జిల్లా స్థాయిలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. గత సమావేశ మినిట్స్‌పై తీసుకున్న చర్యలను జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి జ్యోతిలక్ష్మీదేవి సభ్యులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు నష్ట పరిహారాలు అందించడంలో జిల్లా ఆరో స్థానంలో నిలిచిందన్నారు. వసతి గృహ బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు బేసిక్ ఎమర్జెన్సీకి ఐసీఐసీఐ లాంబార్డ్ గ్రూపు ఇన్సూరెన్స్‌ను సీఎస్సార్ ద్వారా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. తద్వారా రూ.50 వేల బీమా పరిహారం అందుతుందన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా 44 యూనిట్లకు రూ.376 లక్షలు కేటాయించినట్టు చెప్పారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు ముందుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిర్దేశిత సమయంలో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 25 కేసులుండగా, 19 కేసులకు ఎఫ్‌ఐఆర్ దశలో రూ.12 లక్షలు, చార్జిషీట్ దశలో ఆరు కేసులకు రూ.6 లక్షలు పరిహారాలుగా అందించారన్నారు. కమిటీ సభ్యులు పుణ్యమతుల రజిని, డీఆర్‌ఓ కె.మాధవి, ఆర్డీవోలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఉద్యాన, పరిశ్రమల కేంద్రం
అధికారులతో కలెక్టర్