హామీలన్నీ నెరవేర్చాం

TRS Party Solve All Election Promises In Nizamabad - Sakshi

ఆర్మూర్‌ నియోజకవర్గంలో  రూ. 2,500 కోట్లతో అభివృద్ధి 

టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ అభ్యర్థి  ఆశన్నగారి జీవన్‌రెడ్డి

 సాక్షి, ఆర్మూర్‌: గత ఎన్నికల్లో చెప్పింది చెప్పినట్లుగా ప్రతి హామీని నెరవేరుస్తూ ఆర్మూర్‌ నియోజకవర్గంలో 2,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆర్మూర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని మినీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా ప్రంసగించగా అంతకు ముందు జీవన్‌రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్‌లో తాగునీటి సౌకర్యం, పట్టణంలోని ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశామన్నారు. ఈ ఆస్పత్రిలో 18 వేల 800 మంది ఉచితంగా కాన్పులు చేయించుకున్నారని పేర్కొన్నారు.

ప్రైవేటు ఆస్పత్రిలో అయితే ఒక్కొక్కరికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు అవుతుందన్నారు. ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ను సాధించుకున్నామన్నారు. అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో సైతం ఆర్మూర్‌ను అభివృద్ధి పథంలో ముందుంచుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవితకే దక్కిందన్నారు. రూ. 109 కోట్లతో లక్కంపల్లి సెజ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్‌ రోడ్డు విస్తరణ పనులకు రూ. 110 కోట్లు, నందిపేట మండలంలోని ఉమ్మెడ నుంచి పంచగవ్వకు గోదావరి నదిపై వంద కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వీటితో పాటు వేల మందికి ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు జీవనభృతి అందుతోందని వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో ఆడపిల్లలను చిన్న చూపు చూస్తే శాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలతో పాటు గర్భిణీలకు ఆర్థిక సహాయంతో పాటు పుట్టిన బిడ్డకు కేసీఆర్‌ కిట్లను అందజేస్తున్నామన్నారు.

అంతకు ముందు ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి సింగ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి జీవన్‌రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధిని సాధించుకుంటామన్నారు. సభలో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ కవిత, శాసన సభ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి తుల ఉమ, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ మధుశేఖర్, కోటపాటి నర్సింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ సభ సైడ్‌లైట్స్‌

సాక్షి, ఆర్మూర్‌: ఆర్మూర్‌ పట్టణంలోని మినీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఉదయం 11 గంటల నుంచే ప్రజలు వాహనాల్లో తరలి వచ్చారు.

  • మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం నుంచి టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రసంగాలు ప్రారంభించారు.
  • పార్టీ శ్రేణులు ముందుగా సూచించిన గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 45 నిమిషాలు ఆలస్యంగా 4.45 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్మూర్‌ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా స్థలికి చేరుకున్నారు.
  • సభా స్థలికి చేరుకోగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 24 నిమిషాల పాటు పార్టీ కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
  • ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అచ్చమైన ఉర్దూ భాషలో వివరించడంతో ముస్లిం మైనారిటీలను ఆకట్టుకున్నారు.
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు లేదా 61 సంవత్సరాలకు పెంచే ఆలోచన చేస్తామన్నారు.
  • ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన శాసన సభ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి అనుభవాన్ని బంగారు తెలంగాణ అభివృద్ధికి వినియోగించుకుంటామన్నారు. అందుకుగాను ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తూ ఉన్నతమైన స్థానం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
  • 5:15 నిమిషాలకు సభా స్థలి నుంచి జిరాయత్‌ నగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు కేసీఆర్‌ వెళ్లిపోయారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top